-పాయకాపురంలో ఘనంగా ఏకలవ్యుని జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అణగారిన వర్గాలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి పథంలో జీవనశైలిని మార్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. పాయకాపురంలో ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సంక్షేమ సంఘం (ఏపీఈఎస్ఎస్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏకలవ్యుని జయంతి వేడుకల్లో గౌరవ శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏకలవ్యుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణుగారు మాట్లాడుతూ మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర ఏకలవ్యుడని చెప్పుకొచ్చారు. ఏదైనా నేర్చుకోవాలనే బలమైన కాంక్ష ఉంటే.. మనస్సే గురువై అన్నీ నేర్పిస్తుందనడానికి ఏకలవ్యుని జీవిత చరిత్రే నిదర్శనమన్నారు. అర్జునుడికి ధీటుగా ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడన్నారు. గురుదక్షిణగా బొటనవేలునే ఇచ్చి తన గొప్పతనాన్ని చాటుకున్నాడని పేర్కొన్నారు. ఏకలవ్యుని స్ఫూర్తితో గిరిజనులు అభివృద్ధిని సాధించాలని కాంక్షించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాటుబడుతున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. నామినేటెడ్ పదవుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
చేపల మార్కెట్ సందర్శన…
అనంతరం స్థానిక చేపల మార్కెట్ ను శాసనసభ్యులు పరిశీలించారు. దుకాణదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని.. వీఎంసీ తరపున పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హామీనిచ్చారు. అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు యర్రగొర్ల తిరుపతమ్మ, అలంపూరు విజయలక్ష్మి, మోదుగుల తిరుపతమ్మ, స్థానిక నాయకులు యర్రగొర్ల శ్రీరాములు, అలంపూర్ విజయ్ కుమార్, బోరా బుజ్జి, మేడా రమేష్, దాసు, కె.శ్రీను తదితరులు పాల్గొన్నారు.