తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి శుక్రవారం తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. గతంలో తనిఖీల సందర్భంగా సూచించిన పలు పనుల ప్రగతిని పరిశీలించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో పచ్చదనం పెంచి భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దక్షిణ మాడ వీధిలో పచ్చదనం పెంచేలా, అవసరమైన ఇతర ప్రాంతాలు, కాటేజీల మధ్యభాగంలో ఉద్యానవనాలు పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు. భక్తులు నడిచే ఫుట్‌పాత్‌లలో విరిగిన టైల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు, భక్తులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటుకు ఆదేశించామన్నారు. శ్రీవారికి అవసరమయ్యే పుష్పాలను తిరుమలలోనే పండించేందుకు కార్యాచరణ రూపొందించామని, ఇందుకోసం పలువురు దాతలు కూడా ముందుకొస్తున్నారని చెప్పారు. శ్రీవారికి నైవేద్యానికి, దీపారాధన కోసం దేశీయ ఆవునెయ్యిని ఇక్కడే తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. టిటిడి ఆలయాల్లో వినియోగించిన పుష్పాలను మరుసటి సేకరించి తిరుపతిలోని గోశాలలో అగరబత్తీలు తయారుచేసేందుకు చర్యలు చేపట్టామని, ఆగస్టు 15 నాటికి కొన్ని ఉత్పత్తులను విడుదల చేస్తామని చెప్పారు. ఈ అగరబత్తీలను తిరుమలలో కౌంటర్లు ఏర్పాటుచేసి భక్తులకు విక్రయిస్తామని, ఇందులో వచ్చే లాభాన్ని గోసంరక్షణకు వినియోగిస్తామని వివరించారు. అంతకుముందు బూందీ పోటులో శనగపిండి మిక్సింగ్, బూందీ తయారీ, థర్మోఫ్లూయిడ్ స్టౌలను ఈవో పరిశీలించారు. అదేవిధంగా జిఎన్‌సి టోల్‌గేట్, సైనిక్ నివాస్, లడ్డూ కౌంటర్లు, గోశాల, నిర్మాణంలో ఉన్న పరకామణి భవనాన్ని పరిశీలించారు. నారాయణగిరి ఉద్యానవనాల్లో వ్యర్థాలను తొలగించాలని అధికారులకు సూచించారు. శ్రీవారిమెట్టు మార్గంలో పల్లపు ప్రాంతాల్లో ఉద్యానవనాలు పెంచాలన్నారు. ఏఎన్‌సి ప్రాంతంలో వర్షపునీరు నేరుగా ఉద్యానవనాల్లోని చెట్లకు చేరేలా ఏర్పాటు చేయాలన్నారు. ఈవో వెంట టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, డిఎఫ్‌వో చంద్రశేఖర్, రిసెప్షన్ డెప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సునీల్ తదితరులు ఉన్నారు.
Tags tirumala
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …