Breaking News

కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే శాశ్వత పరిష్కారం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-వ్యాక్సినేషన్ లో ఏపీ దేశానికే ఆదర్శం
-మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే  మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే శాశ్వత పరిష్కార మార్గమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా సత్యనారాయణపురంలోని A.K.T.P.M.C. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఒక్క రోజే విజయవాడ నగరంలో 22 వేల మందికి వ్యాక్సినేషన్ అందించగా సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 7 వేల మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలియజేశారు. ప్రతి వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద వైద్యుల పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేపడుతున్న పటిష్ట చర్యలతో.. కోవిద్ మొదటి, రెండు వేవ్ లను సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని మల్లాది విష్ణు గారు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కోవిడ్‌ చికిత్సను మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగిందన్నారు. కేంద్రం సైతం రాష్ట్ర ప్రభుత్వ చర్యలను అభినందిస్తూ లేఖలు రాసినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ అవకాశాన్ని 45 ఏళ్ల పైబడిన వారు, ఇదేళ్ల లోపు చిన్నారుల తల్లులు, గర్భిణులు, హెల్త్, శానిటేషన్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలో పాఠశాలలు పున: ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయులందరూ వ్యాక్సినేషన్‌ ద్వారా కోవిడ్‌ మహమ్మారి నుంచి రక్షణ పొందాలన్నారు.

విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక కేంద్రాలు…
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులందరికీ ప్రత్యేక కేంద్రాలలో వ్యాక్సిన్ వేయనున్నట్లు మల్లాది విష్ణు  తెలియజేశారు. ఇతర దేశాల్లోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంతో.. సెంట్రల్ పరిధిలో న్యూ గిరిపురం కమ్యూనిటీ హాల్లోని పీహెచ్ సెంటర్లో బుధవారం, శనివారం రెండు రోజుల పాటు వ్యాక్సిన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. టీకా కోసం వచ్చేవారందరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. అనంతరం వ్యాక్సిన్ తీసుకున్న వారితో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును పర్యవేక్షించారు. కార్యక్రమంలో 33 వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి, ఎస్.శ్రీనివాస్, ఏ.శ్రీనివాస్, కె.వెంకట రమణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *