-అధ్వాన్న పారిశుద్ధ్యంపై ఆగ్రహం
-ఎమ్మెల్యే చొరవతో మురుగు సమస్యకు తక్షణ పరిష్కారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించవలసిన అవసరం ఉందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సోమవారం నాడు 33వ డివిజన్ లో ఆయన విస్తృత పర్యటన చేశారు. రాజేశ్వరి వీధి, జల్లా వారి వీధులలో వర్షపు నీరు రోడ్డుపై నిలిచి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి వర్షపు నీరు ఇండ్ల ముందరే నిల్వ ఉన్నా.. ఎందుకు తొలగించడంలేదని మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని మండిపడ్డారు. తక్షణమే యుద్ధప్రాతిపదికన ట్యాంకర్ సాయంతో నీటిని తొలగించాలని ఆదేశించారు. మురుగునీరు పారేందుకు వీఎంసీ ప్రత్యేక నిధులతో శాశ్వత ప్రాతిపదికన కాలువను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సర్కిల్ -2 పరిధిలోని పన్నులు చెల్లింపు విభాగాన్ని గౌరవ శాసనసభ్యులు సందర్శించారు. ప్రజల సౌకర్యార్థం మరో అదనపు కౌంటర్ ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
పాఠశాలలో అభివృద్ధి పనుల పరిశీలన…
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని మల్లాది విష్ణు గారు అన్నారు. సత్యనారాయణపురంలోని A.K.T.P.M.C. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ‘నాడు-నేడు’ ఒక విప్లవాత్మకమైన మార్పుగా అభివర్ణించారు. పాఠశాల రూపురేఖలు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ వారి పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పిస్తున్నారన్నారు. మొదటి విడత నాడు-నేడు పనులను ఆగస్టు 16 వ తేదీన ప్రజలకు అంకితం చేయబోతున్నట్లు చెప్పారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి పెండింగ్ పనులను పూర్తి చేయవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో 33 వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి, ఎస్.శ్రీనివాస్, ఏ.శ్రీనివాస్, కె.వెంకట రమణ, సుధాకర్, నాడార్స్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.