-మాస్క్ లేకపోతే రూ. 100 జరిమానా కట్టాల్సిందే…
-కోవిడ్-19 ప్రొటోకాల్ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ఏర్పాటు…
– సబ్ కలెక్టరు జి.యస్.యస్. ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మాస్క్ లేనివారిని గుర్తించి జరిమానా విధించేందుకు నగరంలో కోవిడ్-19 ప్రొటోకాల్ ఎన్‌ఫోర్స్ మెంట్ 15 బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయని విజయవాడ సబ్ కలెక్టరు జి. సాయి సూర్య ప్రవీణ్ చంద్ చెప్పారు. నగరంలో 3 సర్కిల్స్ పరిధిలో రెవెన్యూ, వియంసి, పోలీస్ సిబ్బందితో కూడిన కోవిడ్ – 19 ప్రొటోకాల్ ఎన్ఫోర్స్మెంట్ 15 బృందాలు వారికి నిర్దేశించిన ప్రాంతాలలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పర్యటించి మాస్క్ లేనివారిని గుర్తించి జరిమానా విధించడం జరుగుతుంద న్నారు. ఈ బృందాలు మంగళవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి మాస్క్ ధరించడం పై అవగాహన కూడా కల్పించడం జరిగిందన్నారు. సర్కిల్-1 పరిధిలో 5 బృందాలు కేదరేశ్వరరావు పేట, మ్యాంగో మార్కెట్, మల్లిఖార్జున పేట, అశోక్ పిల్లర్ ప్రాంతం, భవానిపురం,
క్రొత్త పేట, గణపతిరావురోడ్, చేపలమార్కెట్, పంజా సెంటర్ , రైల్వే వెస్ట్ బుకింగ్ ప్రాంతాలలో పర్యటిస్తాయన్నారు. అదేవిధంగా సర్కిల్-2 పరిధిలో బీ సెంట్ రోడ్, ఏలూరు రోడ్, యంజి.రోడ్, క్రొత్తవంతెన సెంటర్ , గవర్నమెంట్ ప్రెస్ ప్రాంతం, అజిత్ సింగ్ నగర్ , ప్రకాష్ నగర్ , పైపులరోడ్ పరిధిలో పర్యవేక్షిస్తాయన్నారు. సర్కిల్-3 పరిధిలో మాచవరం డౌన్, గుణదల, మొగల్రాజపురం, పిన్నమనేని పాలిటెక్నిక్ రోడ్, నిర్మలా కాన్వెంట్ రోడ్, పటమట రైతుబజార్ , కృష్ణలంక ప్రాంతాలలో పర్యటిస్తాయన్నారు. మాస్క్ ధరించికపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా రూ. 100/-లు జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపార సముదాయాలు, షాపుల్లో మాస్క్ లేకుండా అనుమతిస్తే రూ.500/-లు జరిమానా విధించబడుతుందన్నారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో ఆయా మాల్స్ లో, వ్యాపార సముదాయాలలో వినియోగదారులు గుమిగూడి ఉన్నట్లు గమనించినా రూ. 500/-లు జరిమానా విధించబడుతుందన్నారు. కరోనా నుంచి పూర్తి స్థాయి రక్షణకోసం విధిగా మాస్క్ ధరించవలసిందేనని ఆయన సూచించారు. ఒకరి నుంచి ఒకరికి కరోనా వ్యాపించకుండా ఉండాలంటే కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించవలసిందేనని సబ్ కలెక్టరు జి.యస్.యస్. ప్రవీణ్ చంద్ స్పష్టం చేశారు.