-జగనన్న పాలన రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపింది
-రైతు స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపిందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుణదల ప్రాంతంలోని 1వ వార్డు సచివాలయంలో నిర్వహించిన రైతు స్పందన(రైతు సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఉద్ధంటి సునీత సురేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రం ద్వారా అన్నదాతలకు ఎరువులు మరియు ఈ-క్రాప్ నమోదు ధృవీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో చూసిన చీకటి రోజులను రాష్ట్ర రైతాంగం ఇంకా మరచిపోలేదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన రైతుల్లో ఆత్మ విశ్వాసం నింపిందని, రైతులు తమ సొంత కాళ్లపై నిలబడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు బకాయిలు పెట్టిన రూ.990 కోట్లను.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టగానే చెల్లించడం జరిగిందన్నారు. మరోవైపు దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతోందన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు ప్రయోజనాలే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మరోవైపు ప్రతీ నెల మొదటి మరియు మూడవ బుధవారం నిర్వహించే రైతు స్పందన కార్యక్రమాన్ని రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కోరారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె.రఘురాం, డిప్యూటీ తహశీల్దార్ చంద్రమౌళి, ట్రాన్స్ కో ఏఈ ఆర్.సూర్యనారాయణ, మండల పశు వైద్యాధికారిణి డాక్టర్ కె.సుధారాణి, స్థానిక నాయకులు ఉద్ధంటి సురేష్, మహేశ్వర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, బండి వేణు, రమణి, సత్యవతి, బుంగా రాము, అప్పల నాయుడు, యలమంద తదితరులు పాల్గొన్నారు.