-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారానికే డివిజన్ పర్యటనలు నిర్వహిస్తోన్నట్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 1 వ డివిజన్ లోని లెనిన్ నగర్ లో కార్పొరేటర్ శ్రీమతి ఉద్ధంటి సునీత గారితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటుగా.. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత చంద్రబాబు పాలనలో డివిజన్ పూర్తి నిర్లక్ష్యానికి గురైందని వ్యాఖ్యానించారు. కాలనీలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలోనూ ఘోరంగా విఫలమయ్యారని పేర్కొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు వెల్లడించారు. గడిచిన రెండేళ్లలో ఒక్క 1వ డివిజన్ లోనే రూ. 5.50 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టగా.. రూ. 2 కోట్ల 75 లక్షల పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. మరో రూ. 2 కోట్ల 75 లక్షల పనులు వివిధ దశలలో ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా డివిజన్ లో 1,487 మందికి వైఎస్సార్ పింఛన్ కానుక, 2,083 మందికి అమ్మఒడి, 1,013 మందికి జగనన్న విద్యాదీవెన, 393 మందికి చేయూత, 238 మందికి జగనన్న తోడు, 217 మందికి కాపునేస్తం, 118 మందికి చేదోడు, 142 మందికి వాహనమిత్ర పథకాలను వర్తింపచేసినట్లు తెలియజేశారు. ఈ సంక్షేమం, అభివృద్ధి రానున్న రోజుల్లోనూ ఇదేవిధంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ నాయకులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప ప్రజా ప్రయోజనాలు వారికి పట్టడం లేదని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాను అటకెక్కించి, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉండి రూ. లక్షల కోట్లు అప్పులు చేస్తూ.. రాష్ట్ర అప్పులపై వారు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం బాగుపడుతుంటే చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు నానా యాగీ చేస్తున్నాయని మండిపడ్డారు. ఆర్థిక అసమానతలు తొలగించే దిశగా కృషి చేస్తున్న ఈ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.
మహిళల రక్షణలో ‘దిశ’ యాప్ కీలకపాత్ర…
మహిళలకు అత్యవసర సమయాలలో రక్షణ కల్పించడంలో దిశ యాప్ కీలక పాత్ర పోషిస్తోందని మల్లాది విష్ణు అన్నారు. ఎస్వోఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వస్తారని తెలియజేశారు. దిశ యాప్ ఉంటే మహిళలు ఎక్కడికి వెళ్లినా అన్నయ్య తోడుగా ఉన్నట్లేనన్నారు. కనుక డివిజన్ లోని ప్రతి ఒక్క మహిళ, యువతి, విద్యార్థిని కూడా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం మహిళ పోలీసులు, సచివాలయ సిబ్బంది ఇంటింటికీ ప్రచారం నిర్వహించి వారిలో అవగాహన పెంచాలన్నారు. అనంతరం మల్లాది విష్ణు సమక్షంలో మాచవరం ఎస్సై బి.నాగమణి గారు స్థానిక మహిళలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే విధానాన్ని తెలియజేయడంతో పాటు.. వినియోగించే ప్రక్రియను వివరించారు. ఆపదలో ఉన్నామని సమాచారం ఇచ్చే మహిళలకు.. క్షణాల్లో యాప్ ద్వారా సహాయం అందుతుందని నాగమణి గారు వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉద్ధంటి సురేష్, మహేశ్వర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, బండి వేణు, రమణి, సత్యవతి, బుంగా రాము, అప్పల నాయుడు, యలమంద, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.