-సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు…
-స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడిండి. ఈ సందర్భంగా అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియం, దేవీనగర్, బీసెంట్ రోడ్, లెనిన్ సెంటర్, సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, బుడమేరు వంతెన, ఆంధ్రప్రభ కాలనీ సహా పలుచోట్ల జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తొలుత జాతిపిత మహాత్మ గాంధీజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాలలో నివసిస్తున్న దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ 75 ఏళ్ల కాలంలో దేశం ఎంతో పురోగతి సాధించిందని.. ఇంకా సాధించాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం అనేది కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా జరుపుకునే పండుగ అని పేర్కొన్నారు. జాతీయ జెండాను ఎగురవేయడమంటే స్వేచ్చను అనుభవించడమేనని మల్లాది విష్ణు గారు అన్నారు. దాదాపు 200 ఏళ్ల పాటు బ్రిటిషర్ల పాలనలో మగ్గిపోయిన భారతావని.. సుదీర్ఘ పోరాటాలు, ఎందరో మహాత్ముల ప్రాణత్యాగాలతో స్వేచ్ఛా వాయువులను పీల్చుకుందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అశువులుబాసిన త్యాగధనులను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ దాస్య శృంఖలాలను తెంచేందుకు పోరాట పటిమను, తెగువను చూపినవారిలో కృష్ణా జిల్లా నాయకులు ముందు వరుసలో నిలిచారని మల్లాది విష్ణు అన్నారు. నాడు విజయవాడ కేంద్రంగా ఎన్నో పోరాటాలు సాగాయని గుర్తుచేశారు. మరీముఖ్యంగా పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం జాతి సమైక్యతకు, జాతి సమగ్రతకు చిహ్నంగా నిలిచిందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించి.. ప్రతి ఒక్కరిలో ఉద్యమ స్ఫూర్తి రగిలించిందని తెలిపారు. ఎందరో మహానుభావులు మన దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకొస్తే.. మన జగనన్న ఆయన పాలన ద్వారా ఆ మహానీయుల త్యాగాలకు సరైన నివాళి అర్పిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. నిజమైన స్వాతంత్య్ర ఫలాలు ప్రజలకు దక్కేలా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధనలో భాగంగా గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి.. అనేక సంక్షేమ పథకాలను చిట్టచివరి వ్యక్తి వరకూ అందజేస్తున్నారన్నారు. కనుక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సుస్థిర అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా పథకాలు అమలు చేస్తూ.. నవరత్నాలతో నవయుగానికి నాంది పలికిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి అండగా నిలవాలని మల్లాది విష్ణు కోరారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి ప్రజలందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ల ఇంఛార్జిలు, కోఆర్డినేటర్లు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.