విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే మూడు రోజుల పాటు కృష్ణాజిల్లా తీరప్రాంత మండలంలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను జిల్లా కలెక్టర్ జె. నివాస్ కోరారు. ఆగష్టు 21 వ తేదీ నుంచి ఆగస్టు 24 వ తేదీ వరకు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు జిల్లావ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ శనివారం ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తీరప్రాంతంలోనిఅన్ని మండలాల్లోని తహశీల్దార్లు అందరూ ఆయా మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ప్రజలకు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని , అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. ఈనెల 24 వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించరాదని సముద్ర తీరప్రాంత తహశీల్దార్ లు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున గ్రామాల్లో పరిస్థితిని గమనించడానికి గ్రామ రెవెన్యూ అధికారులు,గ్రామ స్థాయి కార్యదర్శులందరూ తమ గ్రామాలలోనే ఉండాలని ఆదేశించారు. అవసరమైతే గుర్తించిన కేంద్రంలో పునరావాసం కల్పించాలన్నారు. లోతట్టు ప్రదేశాలలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి వారిని తరలించడానికి తగిన ఫంక్షన్ హాల్/పాఠశాలలు మొదలైనవి గుర్తించాలన్నారు. భారీ వర్షాలు, వాటితోపాటే వరదలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున లంక గ్రామాలను కలిగి ఉన్న తహశీల్దార్లు మత్స్య శాఖ ,అగ్నిమాపక శాఖతో సంప్రదింపులు జరిపి పడవలు, ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు.