-ఉచిత విద్యుత్లో నగదు బదిలీ అమలుకు రైతుల్లో భారీ స్పందన
-విద్యుత్ సంస్థలకు స్వచ్చందంగా అంగీకారం తెలిపిన 92 శాతం రైతులు
-రైతుల భాగస్వామ్యంతోనే నగదు బదిలీ పథకం అమలుకు శ్రీకారం
-నగదు బదిలీని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి .. ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి
-30 ఏళ్ళ పాటు ఉచిత విద్యుత్ ఢోకా లేకుండా ఇవ్వడమే లక్ష్యం– ఇంధన శాఖ మంత్రి
-ఉచిత విద్యుత్ ను దేశంలో నెంబర్ వన్ పథకం గా మార్చడమే ముఖ్యమంత్రి లక్ష్యం
-వ్యవసాయ మీటర్ల ఏర్పాటు తో విద్యుత్ వినియోగం లో రైతులకు క్లారిటీ
-రైతుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ.. నగదు బదిలీవల్ల రైతుల పై పైసా భారం పడదు
-నగదు బదిలీ పై రైతులలో అవగాహన కార్యక్రమాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వై ఎస్ ఆర్ ఉచిత విద్యుత్ పథకం లో అమలు చేస్తున్న నగదు బదిలీ పథకానికి రైతుల నుండి భారీ స్పందన లభిస్తోంది. నగదు బదిలీ పథకం అమలుకు అనుమతిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 92 శాతం మంది రైతులు విద్యుత్ సంస్థలకు స్వచ్చందంగా తమ అంగీకారం తెలిపారు. దీంతో రైతన్నల అనుమతితోనే నగదు బదిలీ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంస్కరణలలో భాగంగా ఉచిత విద్యుత్ నకు నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . రైతుల భాగస్వామ్యంతో, వారినుండి అనుమతి పొందిన తరువాత మాత్రమే నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ఆదేశించింది. . ఈ మేరకు విద్యుత్ సంస్థలు రైతులకు ఈ పథకం గురించి స్పష్టమైన అవగాహనను గలిగించాయి.
మీటర్ల ఏర్పాటు ఎందుకంటే …
-మీటర్ల ఏర్పాటు వల్ల విద్యుత్ లోడు ఎక్కడ ఎక్కువ ఉందొ దానికి అనుగుణంగా ఏ ట్రాన్సఫార్మలు , విద్యుత్ లైన్ల సామర్థ్యం పెంచాలో డిస్కమ్లు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే లో-వోల్టేజి సమస్యను కూడా గుర్తించే అవకాశం లభిస్తుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైన వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ను పగటి పూటే 9 గంటల పాటు నాణ్యమైన సరఫరా చేసేందుకు వీలవుతుంది.
-గ్రామ , మండల, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు వ్యవసాయ లోడును కచ్చితంగా లెక్కించ వచ్చు
-ఆలా లెక్కించినపుడు సమీపం లోని సబ్ స్టేషన్లకు ఎన్ని విద్యుత్ లైన్లు , ఎన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్లు , పవర్ ట్రాన్సఫార్మర్లు అవసరమవుతాయో అంచనా వేయగలుగుతారు
-ఈ విధంగా విద్యుత్ మౌలిక సదుపాయాలు మెరుగు పరచటం వల్ల నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఎలాంటి అవాంతరాలు , లో-వోల్టేజి సమస్యలు రాకుండా నివారించవచ్చు.
-వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా వల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరిగి, ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుంది.
-ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో వ్యవసాయ విద్యుత్ లోడును కచ్చితంగా లెక్కించే విధానం లేకపోవడం వ్యవసాయ విద్యుత్ సరఫరా పై ప్రభావం చూపుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో రైతులు ఉచిత విద్యుత్ పథకం కింద లబ్ధిదారులుగా ఉండగా, ఇప్పటివరకు 92 శాతం రైతులు నగదుబదిలీ పథకానికి అనుకూలంగా ప్రభుత్వానికి స్వచ్చందంగా తమ అంగీకారాన్ని తెలియచేసారు. అలాగే వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించేందుకు అంగీకరించి విద్యుత్ సంస్థలతో ఒప్పందాల పై సంతకాలు చేసారు.
వ్యవసాయ విద్యుత్ కు యూనిట్ కు సరాసరి ధర రూ 5.73 గా ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించినప్పటికీ, రైతులకి ఒక పైసా భారం పడకుండా ఆ వ్యయాన్నంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. నగదు బదిలీ పథకం వలన కూడా రైతుల పై ఎలాంటి భారం పడదు. ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో నగదును బదిలీ చేస్తోంది. ఈ పథకాన్ని ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆ జిల్లాలో 98. 6 శాతం రైతులు నగదు బదిలీ పథకానికి స్వచ్చందంగా అంగీకారం తెలుపుతూ ఒప్పందం చేసుకున్నారు.
రాష్ట్రంలో నగదు బదిలీ పథకం అమలు పురోగతి పై ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కి వివరించారు. దీని పై మంత్రి స్పందిస్తూ నాణ్యమైన విద్యుత్తు కోసం విద్యుత్ సంస్థలను ప్రశ్నించే హక్కును రైతులకు కలగచేస్తున్న ఈ పథకాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకునేలా.. వారికి అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, తద్వారా ఉత్పాదకతను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఉచిత వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ పథకాన్ని ప్రతి రైతు ముంగిటకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. దీనివ్లల రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం లబ్ధి పొందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వంపై రైతులకు అపారమైన నమ్మకం ఉందని, వారిని మెప్పించి ఈ పథకం అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఈ నగదు బదిలీ పథకం అమలులో రాష్ట్రంలోని ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. నగదు బదిలీ పథకంలో రైతుల హక్కులకు పూర్తి స్థాయి రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ పొందేందుకు రైతులెవరూ చిల్లిగవ్వ కూడా ఖర్చుపెట్టనవసరం లేదని తెలిపారు. రైతులు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం ముందుగానే వారి పేరిట తెరిచే ఖాతాల్లో జమచేస్తుందన్నారు. అదే మొత్తాన్ని రైతులు డిస్కంలకు చెల్లిస్తారన్నారు. దీని వల్ల తమకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా డిస్కంలను ప్రశ్నించే హక్కు అన్నదాతకు లభిస్తుందని చెప్పారు. ఫలితంగా విద్యుత్ సంస్థలు మరింత బాద్యతతో జవాబుదారీ తనంతో వ్యవహరిస్తాయని పేర్కొన్నారు.
ఉచిత విద్యుత్ పథకాన్ని దేశంలోనే నంబర్ వన్ పథకంగా మార్చాలని ముఖ్యమంత్రి సంకల్పించినట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం తీసుకుంటున్న అనేక చర్యలలో ఉచిత విద్యుత్ కు నగదు బదిలీ పథకం కూడా ఒకటి అని పేర్కొన్నారు. ఈ పథకాన్ని రైతుల ప్రశంసలు పొందేలా అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలుస్తామని పేర్కొన్నారు.
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయటం వల్ల తాము ఎంత మేర ఉచిత విద్యుత్ వాడుతున్నారో, దానికి ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందో పారదర్శకంగా తెలుసుకునే అవకాశం రైతులకు లభిస్తుందన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల వ్యవసాయానికి సరఫరా అయ్యే విద్యుత్ నాణ్యత కూడా మెరుగుపడుతుందని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్తు కోసం ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. రైతులకు ఉచిత విద్యుత్ అందచేసే పూర్తి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.
రాబోయే 30 ఏళ్లలో రైతులంతా నాణ్యమైన ఉచిత విద్యుత్ పొందాలనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ ఉచిత విద్యుత్ పథకం నిస్సందేహంగా రైతుల జీవితాల్లో వెలుగు నింపుతుందన్నారు.
నగదుబదిలీ పథకం పై రైతులతో అవగాహనా సమావేవాలు నిర్వహించిన తర్వాతనే వ్యవసాయ బోర్లకు మీటర్ల ఏర్పాటుకు వారితో ఒప్పందాలు జరిగినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. రైతులు సంతోషంతో తమ అనుమతిని ప్రభుత్వానికి తెలియచేశారని అధికారులు తెలిపారు.
ఉచిత విద్యుత్ సరఫరా కు సంబంధించి రైతులకు ఏదైనా సమస్య తలెత్తితే విద్యుత్ సంస్థలు వాటిని వెనువెంటనే పరిష్కరిస్తాయని అధికారులు తెలిపారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు అమర్చటం వల్ల విద్యుత్ లైన్లు , ట్రాన్సఫార్మర్ల పని సామర్థ్యం ఎప్పటికపుడు అంచనావేయవచ్చునని , తద్వారా రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందచేయవచ్చునని అధికారులు తెలిపారు.