-దేవీనగర్ లో సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం…
-వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను సుగుమం చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి శనివారం దేవీనగర్ మధ్య కట్టలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బుడమేరు కాలువ పొంగడంతో నీట మునిగిన 117 ఇళ్లను పరిశీలించారు. కాలువ వెంబడి నివసించడం ఎప్పటికైనా ప్రమాదమని, నివాసితులు ముందుకొస్తే పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మల్లాది విష్ణు తెలియజేశారు. ముంపు వాసుల తరలింపునకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేశామని, త్వరలోనే కాలువకు రక్షణ గోడను సైతం నిర్మిస్తామన్నారు.
అనంతరం సచివాలయ సిబ్బందితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. సంక్షేమ క్యాలెండర్ ను లబ్ధిదారులకు వివరించడం, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సిబ్బంది ఫోన్ నెంబర్లను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సచివాలయాలలో అందిస్తున్న సేవలను ప్రజలకు మరింత చేరువ చేయుటకై రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం, వాలంటీర్ల వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. సిటిజన్ అవుట్ రీచ్‌లో ప్రభుత్వం 543 సేవలు, పథకాలు పొందుపరిచిందని, వాటిని ప్రజలకు వివరించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో ప్రతి ఇంటికి సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు తప్పనిసరిగా వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ ను వివరించాలన్నారు. ఏయే నెలలలో, ఏయే పథకాలు అమలు అవుతాయనే విషయాలను ప్రజలకు క్లుప్తంగా తెలియజేయాలన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కూడా ప్రజలకు అవగాహన కల్పించి.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్పొరేటర్లు సైతం ఇప్పటికే డివిజన్ లలో పర్యటిస్తూ.. వ్యాక్సినేషన్ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారన్నారు. నగర ప్రజల సహకారంతో విజయవాడను కోవిద్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మల్లాది విష్ణు గారు తెలియజేశారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ హాల్ ను సందర్శించారు. పెండింగ్ పనులను పూర్తిచేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని వీఎంసీ కమిషనర్ తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు దుర్గారావు, నారాయణరెడ్డి, నిరంజన్, ముత్యాలు, దుర్గారావు, రఘురాం, వీఎంసీ సీఈ ప్రభాకర్, ఈఈ శ్రీనివాస్, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.