విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి వేడుకలను సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ జరుపుకున్నారు. బావాజీ పేట, అయోధ్యనగర్, గులాబీతోట, మధురానగర్, సింగ్ నగర్ సహా పలు ప్రాంతాలలో ఆదివారం జరిగిన వేడుకలలో శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరికీ విఘ్నాలు తొలగి మంచి జరగాలని వినాయకున్ని ప్రార్థించారు. ఉదయాన్నే వినాయకుడిని దర్శించినా, స్మరించినా, పూజించినా ఆ రోజున పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చెప్పారు. జ్ఞానాన్ని, సంకల్ప సిద్ధిని అనుగ్రహించే గణనాథున్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయన్నారు. ప్రతిపక్షాలు తలపెట్టే విఘ్నాలు తొలగిపోయేలా సీఎం జగన్మోహన్ రెడ్డి కి విఘ్నేశుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కరోనా పరిస్థితులు చక్కబడేంత వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను పర్యావరణ హితంగా, ప్రజాహితంగా మలుచుకోవటం మంచిదన్నారు. నిమజ్జన కార్యక్రమాలను సైతం కాలుష్య రహితంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం పలుచోట్ల దాతలు ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమాలలో పాల్గొని భక్తులకు అన్నదాన ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమాలలో ఆయా డివిజన్ల వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జిలు, కోఆర్డినేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News