-ఉచిత కంటి పరీక్ష శిబిరం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదన్నదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఎల్బీఎస్ నగర్ లోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ పాఠశాలలో సంధ్య కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని డివిజన్ కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి తో కలిసి శాసనసభ్యులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేయడం జరిగిందన్నారు. ఈ పథకం కింద ప్రజలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే పూర్తి ఉచితంగా కంటి పరీక్షలతో పాటు అవసరమైన చికిత్సలు, కళ్ల జోళ్లను అందిస్తున్నామన్నారు. ఈ మహాయజ్ఞంలో భాగంగా ఇప్పటివరకు 93వేల మందికి పైగా అవ్వాతాలకు కంటి శుక్లాల సర్జరీలు చేయడం జరిగిందన్నారు. మరోవైపు సంధ్య కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయమని మల్లాది విష్ణు అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం ద్వారా పేద కుటుంబాలకు తోడ్పాటును అందించినవారవుతారని తెలియజేశారు. అనంతరం వైద్యులు 170 మంది రోగులను పరీక్షించి ఉచిత మందులను అందజేశారు. కార్యక్రమంలో అలంపూర్ విజయ్ కుమార్, వీరబాబు, బోరా బుజ్జి, రామిరెడ్డి, రాజారెడ్డి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.