-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ
-ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-దాదాపు రూ. 10 కోట్ల జేజేఎం-అమరజీవి జలధార నిధులతో నాగులాపల్లి మంచి నీటి పథకం పునరుద్ధరణ
-ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో పనులు పూర్తి
-52 ఆవాసాలు.. 97 వేల మందికి తాగునీటి కష్టాల నుంచి ఉపశమనం
-కొత్త నిర్మాణాలను పరిశీలించి.. స్వయంగా నీటి నాణ్యత పరీక్షించిన పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం దాదాపు రూ. 10 కోట్లతో ఆధునీకరించిన పిఠాపురం నియోజకవర్గం నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార నిధులతో ఆధునీకరణ పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో విషయం సాధించిన తరువాత చేపట్టిన పర్యటనలో- పవన్ కళ్యాణ్ దృష్టికి వాకపల్లి, ఇసుకపల్లి, నాగులాపల్లి, కొండెవరం, యు. కొత్తపల్లి మండలంలోని తీర ప్రాంత ఆవాసాలకు చెందిన ప్రజలు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని, అరకొర నీటితో సరిపెట్టుకోవాల్సి వస్తోందన్న విషయాన్ని దృష్టికి తీసుకువచ్చారు. ఆ సందర్భంలో నాగులాపల్లి మంచినీటి పథకాన్ని, వాకపల్లి చెరువును స్వయంగా పరిశీలించారు. గతంలో నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకం నిర్మించినప్పుడు మనిషికి 40 లీటర్ల తాగునీటి సరఫరా లక్ష్యంగా నిర్ధారించారు. అయితే నిర్మాణం చేపట్టినప్పటితో పోలిస్తే ఆవాసాల సంఖ్య, ప్రజల సంఖ్య గణనీయంగా పెరగడంతో వారి అవసరాలకు సరిపడా తాగునీటి సరఫరా కష్టసాధ్యంగా మారింది. సమస్యను గుర్తించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు జేజేఎం-అమరజీవి జలధార నిధులతో తక్షణం నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకం పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు.
ఇంటేక్ వెల్ సామర్థ్యాన్ని పెంచేందుకు మూడు 20 హెచ్‌పీ మోటార్లు ఏర్పాటు చేశారు. నవఖందరాడ నుంచి శుద్ధి చేయని నీటిని వాకపల్లి వరకు తరలించేందుకు 3.8 కిలోమీటర్ల మేర భారీ పైపు లైన్ వేశారు. నీటిని శుద్ధి చేసేందుకు రెండు మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు మూలపేట గ్రామంలో పాత పైపు లైన్ దెబ్బతినడంతో కొత్త పైపు లైన్ ఏర్పాటు చేశారు. సంపులు, ట్యాంకులు మొత్తాన్ని పునరుద్ధరించి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేశారు. పిఠాపురం పర్యటనలో భాగంగా నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని సందర్శించి, ఆధునీకరించిన విభాగాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆధునీకరణకు సంబంధించిన ఫోటో గ్యాలరీని వీక్షించారు. కొత్త వాటర్ పైప్ లైన్ మ్యాప్ ను పరిశీలించారు. యు. కొత్తపల్లి మండల పరిధిలోని 51 ఆవాసాలు, పిఠాపురం రూరల్ మండల పరిధిలోని ఒక ఆవాసానికి తాగునీటి కష్టాలు తీర్చారు. దాదాపు 97 వేల మందికి పైగా రోజుకు తలకు 55 లీటర్ల రక్షిత తాగునీటిని అందించే విధంగా తీర్చిదిద్దారు.
* ల్యాబ్‌లో నీటి నాణ్యత పరీక్ష
గత పర్యటనలో గుర్తించిన లోపాలు, పునరుద్ధరణ ప్రక్రియలో నూతనంగా ఏర్పాటు చేసిన యంత్రాలు, పైపులు, సంపులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. నాగులాపల్లి రక్షిత మంచినీటి పథకం నీటి సరఫరా మ్యాప్‌ను తిలకించారు. అనంతరం ల్యాబ్‌లో నీటి నాణ్యతను స్వయంగా పరీక్షించారు. నాగులాపల్లి రక్షిత మంచినీటి పథకానికి ప్రధాన నీటి వనరు అయిన చెరువుని పరిశీలించారు. తాగునీటి చెరువు చుట్టు పక్కల కాలుష్య కారకాలైన జలాలు ఏమైనా విడుదల అవుతున్నాయా? అని అధికారులను ఆరా తీశారు.
* గతంలో మూడు బిందెల నీరే వచ్చేది.. ఇప్పుడు పది బిందెలు వస్తున్నాయి
అనంతరం నాగులాపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకానికి సమీపంలో ఉన్న కొండెవరం గ్రామాన్ని సందర్శించి, బర్రె లక్ష్మణ దాసు ఇంటి వద్ద ట్యాప్ తిప్పి నీటి సరఫరాను పరిశీలించారు. గృహాల వద్ద కుళాయిల్లో వస్తున్న నీటి నాణ్యతను పరిశీలించి, తాగునీటి అవసరాలకు సరిపడినంతగా నీరు అందుతుందా అని వాకబు చేశారు. పునరుద్ధరణ తర్వాత నీటి కష్టాలు తీరాయని బర్రె లక్ష్మణ దాసు కుటుంబ సభ్యులు ఉప ముఖ్యమంత్రికు తెలిపారు. గతంలో కుళాయి ద్వారా మూడు బిందెల నీరు మాత్రమే వచ్చేవని, ఇప్పుడు పది బిందెలకు వరకు వస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ, రాజానగరం శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ, నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ఇ.ఎన్.సి. గాయత్రిదేవి, పడా పీడీ శివరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News