గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర ప్రజలకు ఆహ్లాదకరంగా, ఆనందకర వాతావరణంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుండి సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. జిఎంసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలపై నగర మేయర్, కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ లతో కలిసి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సంక్రాంతి సంబరాలను ఈ ఏడాది తొలిసారిగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని కాకుమానువారితోటలోని ప్రభుత్వ స్థలంలో కూడా నిర్వహించనున్నామన్నారు. 11వ తేదీ నుండి ఎన్టీఆర్ స్టేడియంలో, 13వ తేదీ నుండి కాకుమానువారితోట స్థలంలో సంక్రాంతి సంబరాలు జరుగుతాయన్నారు. ఇక నుండి ప్రతి ఏడాది నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో సంబరాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. వివిధ క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో జరిగే సంబరాల్లో నగర ప్రజలకు విస్తృతంగా పాల్గొని ఆనందించాలని కోరారు.
కమిషనర్ మాట్లాడుతూ గత ఏడాది నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని, ఈ ఏడాది మరింతగా అలరించేలా సంబరాలను రూపొందించామమని తెలిపారు. ఎన్నో ఏళ్ల నుండి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించాలన్న ప్రజల కోరిక మేరకు స్థానిక శాసన సభ్యులు నసీర్ కృషితో ఈ ఏడాది అక్కడ కూడా 3 రోజులపాటు అంగరంగ వైభవంగా సంబరాలు జరుగనున్నాయన్నారు. సంబరాల ప్రారంభోత్సవ సందర్భంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు 666 మంది శాస్త్రీయ నృత్య కళాకారులతో నృత్య ప్రదర్శన ఉంటుందన్నారు. నగరంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, సీనియర్ సిటిజన్ల భాగస్వామ్యంతో సంక్రాంతి సంబరాలు జరుగుతాయన్నారు. సంబరాల్లో భాగంగా క్రికెట్, లెమన్&స్పూన్, మ్యూజికల్ చైర్స్, రంగోలి పోటీలు జరుగుతాయని, టీంలు ఎన్టీఆర్ స్టేడియంలో (94928 71972, 96429 83416) తమ వివరాలు అందించాలని తెలిపారు.
తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర మేయర్, కమిషనర్ ల సహకారంతో మన గుంటూరు – మన సంక్రాంతి పేరుతో గుంటూరు తూర్పు నియోజకవర్గం కాకుమానువారితోటలోని ప్రభుత్వ స్థలంలో నారావారి కళా ప్రాంగణంలో తొలిసారిగా జిఎంసి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నామన్నారు. సంక్రాంతి అంటేనే మన సంస్కృతి, శ్రమకు గుర్తింపు అని, వాటిని ప్రతిబింబిస్తూ సంబరాలు జరుగుతాయన్నారు. సంబరాల్లో నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Prajavartha Online Telugu News