Breaking News

కార్యకర్త ఇంటికి వెళ్లి.. నేనున్నానంటూ భరోసా ఇచ్చి..

-కష్టంలో తోడుంటామంటూ ధైర్యం నింపిన  పవన్ కళ్యాణ్
– రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు  చందు వీర వెంకట వసంత రాయలు కుటుంబానికి పరామర్శ
– ⁠వేదనలోనూ సామాజిక బాధ్యతతో అవయవ దానం చేసి  వసంత రాయలు కుటుంబం ఆదర్శంగా నిలిచింది
– రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేత
– అవయవ దానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులకు అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తాం. కష్టంలో వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. బుధవారం పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండల పరిధిలోని పెదచందాల గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు  చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించారు. గత ఏడాది జులైలో దిగమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన  వసంతరాయలుకి బ్రెయిన్ డెడ్ కాగా, అతని కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న  పవన్ కళ్యాణ్  ఆ కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం పెదచందాలలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. భార్య నాగ పుష్పావతి, కుమారుడు సీతారామరాజు, కుమార్తె జాహ్నవిలను ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు. వారు చెప్పిన సమస్యలు ఓపికగా విన్నారు. తండ్రి మరణానంతరం ఉద్యోగం వదిలి కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్న సీతారామరాజుని అభినందించి, అతని వివరాలు తెలుసుకున్నారు. కుమార్తె జాహ్నవికి వినికిడి లోపం, మాటలు రావని తెలుసుకుని టీటీడీ శ్రవణం ప్రాజెక్టు ద్వారా సాయం చేయాలని అధికారులకు సూచించారు. సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ స్కీం కింద ఉపాధి కల్పించే ఏర్పాటు చేయాలన్నారు. మీ కష్టంలో మేము తోడుంటామంటూ భరోసా ఇచ్చారు. జనసేన క్రియాశీలక సభ్యులకు ఇచ్చే రూ. 5 లక్షల బీమా చెక్కుని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం  పవన్ కళ్యాణ్  మీడియాతో మాట్లాడుతూ…

వసంత రాయలు కుటుంబం అవయవదానం కదిలించింది
పశ్చమ గోదావరి జిల్లా, దిగమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు వసంత రాయలుగారి మరణం బాధించింది. ఇంటి పెద్దను కోల్పోతున్నామన్న బాధలోనూ వారి కుటుంబ సభ్యులు అవయవ దానం చేయడం నన్ను కదిలించింది. ఇలాంటి సంఘటనలు అదురుగా జరుగుతాయి. దుఃఖాన్ని దిగమింగుకుని అవయవదానం చేసిన  వసంతరాయలు కుటుంబానికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరణంలోనూ మరో ఐదుగురికి ఊపిరి పోయడం గొప్ప విషయం.  వసంత రాయలు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. ఆయన కుమార్తెకు వినికిడి సమస్య ఉన్నట్టు తెలిసింది. టీటీడీ శ్రవణం పథకం కింద ఆ సమస్యను పరిష్కరిస్తాం. వారి కుటుంబ సభ్యులు రెండు సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారు. వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

అడుగడుగునా జననీరాజనం
వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్  వస్తున్న విషయం తెలుసుకున్న పెడన నియోజకవర్గ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు రోడ్ల వెంబడి బారులు తీరారు. పూలు, పూలమాలలతో కార్యకర్తలు, హారతులతో ఆడపడుచులు గ్రామ గ్రామాన స్వాగతం పలికారు. మచిలీపట్నం శివారు, పెడన, తోటమూల, హుస్సేన్ పాలెం, కట్లపల్లి, సింగరాయపాలెం, బల్లిపర్రు, మడక, నందమూరు, మంజులూరు, బంటుమిల్లి, చిన పాండ్రాక, చెరుకుమల్లి, కృత్తివెన్ను, గాంధీనగర్, పెద చందాల గ్రామాల్లో ప్రజలంతా రోడ్డు వెంట బారులుతీరారు. పలువురు సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ  పవన్ కళ్యాణ్  ముందుకు సాగారు. కార్య్రక్రమంలో పెడన శానస సభ్యులు కాగిత కృష్ణప్రసాద్ , ప్రభుత్వ విప్  బొమ్మడి నాయకర్ , అవనిగడ్డ శాసన సభ్యులు మండలి బుద్దప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్  డి.కె. బాలాజీ , డీసీఎంఎస్ ఛైర్మన్  బండి రామకృష్ణ , వివిధ కార్పోరేషన్ల డైరెక్టర్లు, జనసేన ఎన్టీఆర్, కృష్ణా, జిల్లాల అధ్యక్షులు  సామినేని ఉదయభాను, బండ్రెడ్డి రామకృష్ణ, నియోజకవర్గాల పీఓసీలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *