-శ్రీ స్వర్ణ కవచాలంకృత రూపంలోని శ్రీ దుర్గా దేవికి తొలి పూజ
-ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన వెల్లంపల్లి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, అక్టోబర్ 7: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, వారి సతీమణి సుప్రవ హరిచందన్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించుకుని శ్రీ కనక దుర్గా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. గవర్నర్ దంపతులు శ్రీ స్వర్ణ కవచాలంకృత రూపంలోని శ్రీ దుర్గా దేవి అమ్మవారికి చేసిన తొలి పూజలో పాల్గొన్నారు. గురువారం ఉదయం దేవస్ధానానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ గౌరవ మర్యాదలతో ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, శాసన సభ్యుడు మల్లాది విష్ణు, దేవస్ధానం ఛైర్మన్ పైల సోమి నాయుడు, కార్యనిర్వహణ అధికారి డి. భ్రమరాంబ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గౌరవ హరిచందన్ మాట్లాడుతూ దసరా పండుగ శుభవేళ కనకదుర్గమ్మ దర్శనం పొందడం తన అదృష్టం అన్నారు. తమ కుటుంబంలో కూడా దసరాను అన్ని సంప్రదాయాలతో పాటిస్తామని వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆశీర్వదించాలని, రాష్ట్రం, దేశం శుభిక్షంగా ఉండాలని తాను దుర్గా మాతను ప్రార్థించానన్నారు. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని, అమ్మవారు మొత్తం మానవాళిని ఈ గండం నుండి బయటకు తీసుకురావాలని ఆశిస్తున్నానని హరిచందన్ తెలిపారు.