రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహిస్తున్న 17 నియామక నోటిఫికేషన్లకు సంబంధించిన ఆఫ్‌లైన్ (OMR ఆధారిత – ఆబ్జెక్టివ్ టైప్) రాత పరీక్షలు 27.01.2026 ఉదయం నుంచి 31.01.2026 ఉదయం వరకు తూర్పు గోదావరి జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్న నేపథ్యంలో, పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘ స్వరూప్ వారి ఆదేశాల మేరకు సంబంధిత శాఖలకు విధులు కేటాయించారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి అధ్యక్షతన కలెక్టరేట్‌లోని డీఆర్‌ఓ చాంబర్‌లో సమన్వయ శాఖల అధికారులతో శనివారం సమావేశం నిర్వహించి, శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పోలీసు శాఖ పరీక్ష కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద భద్రతతో పాటు ప్రశ్నాపత్రాలు, OMR షీట్ల రవాణాకు బందోబస్తు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్ వద్ద 24×7 ఆయుధాలతో గార్డులను నియమించాలని ఆదేశించారు. తహసీల్దార్లు (రాజమహేంద్రవరం అర్బన్ & రూరల్) పరీక్ష కేంద్రాలు, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల పరిధిలో సెక్షన్ 144 అమలు చేయాలని సూచించారు. ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని బస్ స్టేషన్ల నుంచి పరీక్ష కేంద్రాలకు తరచూ బస్సులు నడపాలని ఆదేశించారు.
వైద్య, ఆరోగ్య శాఖ ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బందిని, అవసరమైన మందులు, మెడికల్ కిట్లు, ORS ప్యాకెట్లతో నియమించాలని తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ పరీక్ష సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, లైజాన్ అధికారులు పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, ప్రశ్నాపత్రాలు–OMR షీట్ల సురక్షిత సేకరణ, పంపిణీ బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. అలాగే APPSC అధికారులకు వసతి సౌకర్యాలు కల్పించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని, ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమన్వయ బాధ్యతలను జిల్లా రెవెన్యూ అధికారి నిర్వహిస్తారని తెలిపారు.
తేదీలు వారిగా హాజరయ్యే అభ్యర్థుల వివరాలు :
27.01.2026 (మంగళవారం) ఉదయం సెషన్‌కు 1261 మంది, మధ్యాహ్నం సెషన్‌కు 24 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 28.01.2026 (బుధవారం) ఉదయం సెషన్‌కు 30 మంది, మధ్యాహ్నం సెషన్‌కు 487 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. 29.01.2026 (గురువారం) ఉదయం సెషన్‌కు 247 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, ఆ రోజున మధ్యాహ్నం పరీక్షలు లేవు. 30.01.2026 (శుక్రవారం) ఉదయం సెషన్‌కు 768 మంది, మధ్యాహ్నం సెషన్‌కు 247 మంది అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ సమన్వయ శాఖల సమావేశంలో అదనపు ఎస్పీ ఎల్ చెంచు రెడ్డి, ఏఆర్ డీఎస్పీ రవికుమార్, ఏపీపీఎస్సీ అధికారులు, రెవెన్యూ, పోలీసు, పోస్టల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News