గుంటూరు, మహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
లైంగిక నేరాల బాధితులు, పిల్లలు, బెదిరింపుల మధ్య ఉన్న సాక్షులు మళ్లీ మానసిక వేదనకు గురికాకుండా, వారి వాంగ్మూలాలను సురక్షితమైన, భద్రమైన, పిల్లల అనుకూల వాతావరణంలో నమోదు చేసేందుకు అన్ని కోర్టుల్లో వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్లు (VWDCలు) ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నియమించిన వల్నరబుల్ విట్నెస్ కమిటీ చైర్‌పర్సన్ జస్టిస్ గీతా మిట్టల్ స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు నియమించిన వల్నరబుల్ విట్నెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వల్నరబుల్ విట్నెస్ సెంటర్ల కమిటీ సహకారంతో ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఎస్.ఆర్. శంకరన్ హాల్‌లో న్యాయాధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ గీతా మిట్టల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పిల్లలు, వికలాంగులు, దుర్వినియోగానికి గురైన బాధితులు వంటి వల్నరబుల్ సాక్షులకు అనుకూలమైన కోర్టు వాతావరణాన్ని కల్పించడమే కమిటీ లక్ష్యమని చెప్పారు. స్క్రీన్లు, అనువాదకులు, విరామాలు, సహాయక వ్యక్తులు వంటి ప్రత్యేక చర్యలను వినియోగించి, నిందితుడి హక్కులకు భంగం కలగకుండా న్యాయమైన వాంగ్మూలం అందేలా చూడాలని పేర్కొన్నారు.
సాక్షులు నిందితులను ఎదుర్కోకుండా ప్రత్యేకంగా వేచి ఉండే గదులు, వీడియో కాన్ఫరెన్స్ గదులు, సహాయక వ్యక్తుల వినియోగం, నిందితులతో ముఖాముఖి కలవకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రధాన కోర్టు ప్రాంతానికి దూరంగా, పిల్లలకు అనుకూలంగా బొమ్మలు, ఆటవస్తువులు, పుస్తకాలు ఉండే విధంగా అన్ని వయస్సుల వారికి తగిన ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని తెలిపారు. సాక్షుల భద్రత కోసం ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉండాలని అన్నారు.
వాంగ్మూలం సమయంలో తల్లిదండ్రులు, సంరక్షకులు లేదా కౌన్సిలర్ వంటి నియమిత సహాయక వ్యక్తి సాక్షితో పాటు ఉండవచ్చని చెప్పారు. సాక్షుల పేరు, చిరునామా, పాఠశాల లేదా గుర్తింపు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టకుండా కఠినంగా నిషేధించాలని ఆమె స్పష్టం చేశారు.
న్యాయమూర్తులు, కౌన్సిలర్లు సహా సిబ్బంది అంతా పిల్లలు, లైంగిక దాడి బాధితులు వంటి వల్నరబుల్ వ్యక్తులతో వ్యవహరించే తీరుపట్ల తగిన శిక్షణ పొందాలని ఆమె తెలిపారు. దర్యాప్తు లేదా తీర్పు సమయంలో సరళమైన, అర్థమయ్యే భాషను ఉపయోగించాలని, అవసరమైతే అనువాదకులు, సంకేత భాష నిపుణులు, ప్రత్యేక ఉపాధ్యాయులను వినియోగించాలని సూచించారు. ప్రశ్నలు అర్థం చేసుకునే సామర్థ్యంపై దృష్టి పెట్టి, మానసిక వేదనను తగ్గిస్తూ, నిరంతర సహాయాన్ని అందించాలని పేర్కొన్నారు. సాక్షుల హక్కులు, నిందితుడికి న్యాయమైన విచారణ హక్కు మధ్య సమతుల్యత ఉండాలని ఆమె నొక్కి చెప్పారు.
ప్రతి ఒక్కరికీ సమానత్వం, న్యాయానికి చేరువ కల్పించాలనే చట్ట బద్దతను పాటించాలని న్యాయాధికారులను ఆమె కోరారు. వల్నరబుల్ సాక్షులు సివిల్ లేదా క్రిమినల్ కేసుల్లో, కుటుంబ వివాదాల్లో, కస్టడీ వివాదాల్లో, లైంగిక దుర్వినియోగ బాధితులుగా, పితృత్వ కేసుల్లో, జువెనైల్ జస్టిస్ బోర్డుల ముందు, చిల్డ్రన్స్ కోర్టుల్లో హాజరవుతారని ఆమె తెలిపారు.
VWDCల వినియోగం క్రిమినల్ కేసులకే కాకుండా సివిల్ కేసులు, కుటుంబ కోర్టులు, జువెనైల్ జస్టిస్ బోర్డులు, చిల్డ్రన్స్ కోర్టుల వంటి ఇతర న్యాయ విభాగాలకు కూడా అనుమతించాలన్నారు. అన్ని న్యాయ విభాగాల్లో వల్నరబుల్ సాక్షుల వాంగ్మూలాల రికార్డింగ్‌కు అనుమతి ఇవ్వాలని ఆమె సూచించారు.
పిల్లలు పలు ఇంటర్వ్యూలు ఎదుర్కోవడం, ట్రయల్‌కు ముందు దీర్ఘకాలం వేచిచూడటం, కోర్టు ఆలస్యాలు, నిందితుడిని ఎదుర్కోవడం, క్లిష్టమైన న్యాయ భాషలో ప్రశ్నలు, అవసరం లేని ప్రశ్నలు, నిజాయితీగా ఇచ్చిన సమాధానాలను నమ్మశక్యం కానివిగా చూపించడం వంటి కారణాల వల్ల పూర్తి స్థాయిలో తమ వాంగ్మూలాన్ని ఇవ్వలేకపోతున్నారని ఆమె అన్నారు.
అనుచిత ప్రశ్నలు, న్యాయవాదుల అడ్డంకులు, పెద్దలు ఎలా సమాధానం చెప్పాలనే సూచనలు, సాక్షులను ఇబ్బంది పెట్టేలా రూపొందించిన క్రాస్ ఎగ్జామినేషన్, అనుమతికి సంబంధించిన పరిమితులు, కథనాలను మార్చుకోవాల్సిన పరిస్థితులు, మానసిక వేదన వల్ల ప్రక్రియ ఆలస్యం కావడం వంటి సమస్యలను ఆమె వివరించారు. నేరస్తుడిని ఎదుర్కోవడం, హింసాత్మక అనుభవాలను మళ్లీ చెప్పుకోవడం, దూషణాత్మక క్రాస్ ఎగ్జామినేషన్ వల్ల ద్వితీయ మానసిక గాయాలు కలుగుతున్నాయని చెప్పారు.
దర్యాప్తు నుంచి తీర్పు వరకు వివిధ దశలలో పాటించాల్సిన మార్గదర్శకాలను అనేక న్యాయ తీర్పులు నిర్దేశించాయని, వాటిని పోలీసులు, వైద్యులు, మేజిస్ట్రేట్లు తప్పనిసరిగా పాటించాలని ఆమె తెలిపారు. ఈ మార్గదర్శకాలు ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలు, అంతర్జాతీయ పత్రాలు, భారతదేశంలోని చట్టాలు, అలాగే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, యూకే, యూఎస్ఎ, ఫిలిప్పీన్స్ వంటి దేశాల న్యాయ తీర్పుల ఆధారంగా రూపొందించబడ్డాయని ఆమె చెప్పారు.
ఈ అన్ని అడ్డంకులను అధిగమించేందుకే వల్నరబుల్ విట్నెస్ కోర్ట్‌రూమ్‌లను ఆలోచించి అమలు చేస్తున్నామని జస్టిస్ గీతా మిట్టల్ తెలిపారు. కోర్టుకు ముందు సందర్శన, కోర్టు హాజరు, వాంగ్మూలం, క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో న్యాయ మూర్తులు నాయకత్వం చూపుతూ సాక్షులతో నేరుగా మమేకం కావాలని, గౌరవంతో వ్యవహరించాలని, ప్రశ్నలు న్యాయంగా, వయస్సుకు తగినట్లుగా ఉండాలని, సాక్షుల గౌరవం, ఆత్మగౌరవం మొత్తం ప్రక్రియలో కాపాడాలని ఆమె సూచించారు.
గుంటూరు విచ్చేసిన జస్టిస్ గీత మిట్టల్ కు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్ల కమిటీ అధ్యక్షులు జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్, న్యాయ మూర్తులు జస్టిస్ ఆర్. రఘునందన రావు, జస్టిస్ వి. సుజాత, జస్టిస్ ఎస్. సమత, జస్టిస్ వి. గోపాల కృష్ణ, జస్టిస్ కిరణ్మయి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. కళ్యాణచక్రవర్తి, ఇతర జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయ అధికారులు, పోలీస్ అధికారులు సరిత, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News