-కలిచేడు, తలుపూరు ఎంఎల్డబ్ల్యూఓ పాఠశాల పునరుద్ధరణపై అనుబంధ ప్రశ్న
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త:
తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీల ప్రారంభంలో జరుగుతున్న జాప్యంపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సోమవారం లోక్సభలో ప్రశ్నించారు. ఇందుకు అనుబంధ ప్రశ్నగా 2023 నవంబర్లో కలిచేడు, తలుపూరు ప్రాంతాల్లో ఎంఎల్డబ్ల్యూఓ పాఠశాల భవనాల పునరుద్ధరణకు సంబంధించిన లేవుట్లు, డ్రాయింగ్లు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు తదుపరి కార్యాచరణ ప్రారంభం కాకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు.
అలాగే 1950లో కలిచేడులో నిర్మించిన జనరల్ ఆసుపత్రి, టీబీ ఆసుపత్రుల సేవలను ప్రభుత్వం ఎప్పుడు పునరుద్ధరిస్తుందో తెలియజేయాలని కోరారు. ఈ ప్రశ్నలకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 17 ఈఎస్ఐ డిస్పెన్సరీల ఏర్పాటుకు ఈఎస్ఐసీ ప్రాథమిక అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. అయితే డిస్పెన్సరీల నిర్వహణ, సిబ్బంది నియామకం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో జాప్యం జరిగిందని స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లాలోని తిరుమల తిరుపతి దేవస్థానం, సత్యవేడు, వరదయ్యపాలెం, నాయుడుపేట ప్రాంతాల్లోని ఐదు డిస్పెన్సరీలు, అలాగే నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని ఒక డిస్పెన్సరీకి అవసరమైన వైద్య, పారామెడికల్, నర్సింగ్ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. మిగిలిన డిస్పెన్సరీలకు సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
పారిశ్రామిక కార్మికుల ఆరోగ్య హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఈఎస్ఐ డిస్పెన్సరీలను త్వరగా ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తున్నామని ఈ సందర్బంగా ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. కలిచేడు ఆసుపత్రి పునరుద్ధరణ అంశంపై స్పందిస్తూ, ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలు ఉంటాయని, ఆ ప్రాంతంలో బీమా పొందిన ఉద్యోగుల సంఖ్యను బట్టి ఆ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News