గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరపాలక సంస్థకు బకాయి ఉన్న పన్ను వసూళ్లకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ఉండాలని, డిప్యూటీ కమిషనర్లు పన్ను వసూళ్లపై రోజువారీ నివేదిక ఇవ్వాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రెవెన్యూ విభాగ సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి పన్ను వసూళ్లు కీలకమని, నగర ప్రజలు కూడా సకాలంలో పన్ను చెల్లించాలని కోరారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది పన్ను వసూళ్లపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు.
కమిషనర్ తొలుత వార్డ్ సచివాలయాల వారీగా ఉన్న అసెస్మెంట్లు, బకాయిలు, రోజువారీ వసూళ్లు చేయాల్సిన లక్ష్యంపై సమీక్షించి, పన్ను వసూళ్లలో పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, రోజువారీ నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా చేయాల్సిన పన్ను వసూళ్లలో పురోగతి లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే రెండో అర్ధ సంవత్సరం వచ్చినప్పటికీ ఆస్తి, ఖాళీ స్థల, త్రాగునీటి, మీటర్ల చార్జీలు వసూళ్లలో అలసత్వం వీడకుంటే ఎలా అని ప్రశ్నించారు. తమ క్షేత్ర స్థాయి పర్యటనల్లో డిమాండ్ నోటీసులు, పన్ను బకాయిలపై స్లిప్స్ అందలేదని ప్రజలు చెప్తున్నారని, ఇక నుండి అడ్మిన్ ప్రతి ఇంటికి డిమాండ్ నోటీసు, స్లిప్ ఇచ్చి పేరు, ఫోన్ నంబర్ తో అకనాల్డ్జిమేంట్ తీసుకొని రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. పని తీరు మార్చుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ విధులు అంకిత భావంతో నిర్వహించాలన్నారు. చాలా ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్నా పన్ను విధించలేదని, ఖాళీ స్తలాలకు కూడా పన్ను విధించలేదని, అండర్ అసెస్మెంట్ లు, అండర్ అసెస్మెంట్ లు తమ దృష్టికి వచ్చాయని, త్వరలో వాటికి పన్ను విధించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బకాయిదారులకు పన్ను చెల్లింపుపై నోటీసులు ఇవ్వడం, స్పందించకుంటే ట్యాప్, డ్రైనేజి కనెక్షన్ లు డిస్ కనెక్షన్ చేయడం, రెడ్ నోటీసులు ఇచ్చి తదుపరి రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు వంటి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పబ్లిక్ టాయ్ లెట్స్ నుండి కూడా సక్రమంగా వసూళ్లు కావడం లేదన్నారు. జిఎంసి షాపింగ్ కాంప్లెక్స్ ల అద్దెలు వసూళ్లతో పాటుగా, ఖాళీగా ఉన్న వాటికి వేలం నిర్వహించాలని, కాంప్లెక్స్ ల వారీగా డిప్యూటీ కమిషనర్లు సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. పన్ను వసూళ్లపై డిప్యూటీ కమిషనర్లు మరింతగా క్షేత్ర స్థాయిలో పాల్గొనాలని, అధిక మొత్తం బకాయిదారులను నేరుగా కలవాలని ఆదేశించారు. పన్నువసూళ్లు, డిమాండ్ స్లిప్స్ పంపిణీ, ఎంత మంది బకాయిదారులను కలిసింది రోజువారీ నివేదిక తమకి అందించాలని ఆదేశించారు.
సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, రెవెన్యూ అధికారులు రవికిరణ్ రెడ్డి, మదన్ గోపాల్, రెహ్మాన్, సాదిక్ పాష, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News