గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
క్వారీ తిరునాళ్లకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పొన్నూరు శాసన సభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ కోరారు. మంగళవారమ ఉదయము చేబ్రోలు మండలం క్వారీ లో గల శ్రీ బాల కోటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద మహా శివరాత్రి తిరుణాళ్ళ ఏర్పాట్లపై డివిజన్ స్థాయి అధికారులతో పొన్నూరు శాసన సభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెనాలి ఇంచార్జ్ సబ్ కలెక్టర్ మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సమావేశంలో శాసన సభ్యులు మాట్లాడుతూ వీలైనంత మంది సామాన్య భక్తులు స్వామి వారి దర్శనం చేసుకునేలా చూడాలన్నారు. అధికారులు పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని ఎటువంటి శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూడాలన్నారు. సామాన్య భక్తులు అధికంగా స్వామి దర్శనానికి వచ్చేలా అభిషేకాలను 6 నుండి 10 గంటల లోపు పూర్తి చేయాలని దేవాదాయ శాఖకు సూచించారు. అలాగే మూడు క్యూలైన్లను కాకుండా రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని , ఒకటి శ్రీఘ్ర దర్శనం అభిషేక దర్శనాలకు , రెండవది సామాన్య భక్తులకు కేటాయించాలన్నారు. 13, 14 మరియు 15 తేదీలలో మహా శివరాత్రి పండుగ నిర్వహించడం జరుగుతుందన్నారు. 13వ తేదీ పొంగలి పశువులను గుడి చుట్టూ తిప్పటం , 14వ తేదీ వాహనాలు , 15వ తేదీన మహా శివరాత్రి పండగ నిర్వహించడం జరుగుతుందన్నారు. వచ్చే భక్తులకు త్రాగునీరు ఏర్పాటు చేయాలని , శానిటేషన్ పక్కగా చేపట్టాలని పంచాయతీ అధికారికి సూచించారు. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రభల వెంట ఉండి విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. అక్కడే ఏర్పాటు చేసే ప్రభల దగ్గర ఎలక్ట్రీషియన్ అందుబాటులో వుంచాలన్నారు. ఆర్టీసీ వారు 23 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారని , భక్తులకు అవసరమైన బస్సులు ఏర్పాటు చేయుటకు ఆర్టీసీ వారు సిద్ధంగా ఉండాలన్నారు. బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు శాఖ 500 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారన్నారు. శివరాత్రి పండుగ డ్యూటీ చేస్తున్న ప్రభుత్వ అధికారులకు పాసులు మంజూరు చేయాలని , అలాగే పూజారులు పూజకు కావలసిన పూలను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు. దేవాలయ పునరుద్ధరణ పనులకు ఎస్టిమేషన్స్ అందించాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించడం జరిగిందన్నారు. దేవాలయ పునరుద్ధరణ పనులకు అనువంశిక ధర్మకర్తలు , ప్రజలు సహకరించాలన్నారు. గుండవరం, గొడవర్రు గ్రామాల నుండి వచ్చే ప్రభలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. రామినేషన్ లేని పౌండేషన్ వారు భక్తులకు త్రాగునీరు , పులిహార అందిస్తారన్నారు. మహా శివరాత్రి పండుగ అందరి పండుగ అని , స్వామి వారి తిరుణాళ్ళకు లక్షలాది మంది భక్తులు వస్తారని వారికి కావలసిన సదుపాయాల ఏర్పాటు చేయుటకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశం అనంతరం మహా శివరాత్రి మహోత్సవములుపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో చేబ్రోలు తహసీల్దార్ శ్రీనివాసు శర్మ , తెనాలి డిఎస్పి జనర్ధాన రావు , డివిజన్ స్థాయి అధికారులు ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News