Breaking News

2047 నాటికి ఆంధ్ర ప్రదేశ్‌ను దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలపేందుకు సీఎం కృషి

-2026–27 కేంద్ర బడ్జెట్ యువత, అభివృద్ధి లక్ష్యంగా రూపొందింపు
– కేంద్ర మంత్రి కే. రామ్మోహన్ నాయుడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని 2047 నాటికి భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢమైన చర్యలు చేపడుతున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే. రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం స్థానిక ప్రవేటు (మంజీరా) కన్వెన్షన్ హాల్‌లో 2026–27 కేంద్ర బడ్జెట్‌పై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ, సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరం రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని అన్నారు. అదే దిశగా, 2047 కల్లా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలపాలనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ఏడు శాతం వృద్ధిరేటు ప్రధాని దార్శినికతకు నిదర్శనం అని, గతంలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థగా పరిగణించబడిన భారతదేశం, నేడు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం వెనుక ప్రధాని దార్శినికత ఉందని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా భారతదేశం గత కొంతకాలంగా సగటున ఏడు శాతం వృద్ధిరేటు సాధిస్తోందని అన్నారు. లక్షలాది మంది యువతీ యువకుల అభిప్రాయాలు, వారి ఆలోచనలు, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొని 2026–27 కేంద్ర బడ్జెట్‌ను రూపొందించామని పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ రూపుదిద్దుకుందని అన్నారు.

యువతకు ఉపాధి, రాష్ట్రాభివృద్ధికి కీలక కేటాయింపులు
రేర్ ఎర్త్ మాగ్నెట్ కారిడార్, హైస్పీడ్ రైల్వే కారిడార్స్ ఏర్పాటు యువతను ప్రోత్సహించే దిశగా తయారీ రంగం, బయోఫార్మా ఇండస్ట్రీ, స్పోర్ట్స్ గూడ్స్, ఐటీ రంగం వంటి కీలక రంగాలకు కేంద్ర బడ్జెట్‌లో గణనీయమైన కేటాయింపులు చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. అలాగే రేర్ ఎర్త్ మాగ్నెట్ కారిడార్, హై స్పీడ్ రైల్వే కారిడార్స్ ఏర్పాటు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు కూడా విమానయానం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. దేశంలో విమానాల తయారీని ప్రోత్సహించేందుకు అవసరమైన విడిభాగాల దిగుమతిపై సుంకాన్ని తొలగించడం జరిగిందన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం, విశాఖపట్నం రైల్వే జోన్ పనులకు కేంద్ర బడ్జెట్‌లో తగిన కేటాయింపులు జరిగాయని తెలిపారు. యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా ఆయా రంగాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *