– కార్యాచరణ, లక్ష్య సాధన పై జిల్లా స్థాయి సమీక్ష
– కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమైన విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER)ను గ్లోబల్ ఎకనామిక్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో భాగంగా శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన జిల్లా కలెక్టర్ల వర్క్‌షాప్‌లో కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో VER ప్రాజెక్టుల పురోగతి, జిల్లా స్థాయి అమలు విధానాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 7 ప్రధాన వృద్ధి రంగాలు, 65–70 కీలక ప్రాజెక్టుల అమలులో తూర్పు గోదావరి జిల్లా పాత్రపై విస్తృతంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి చర్చించారు. వ్యవసాయం, పౌల్ట్రీ, ఆక్వాకల్చర్, నర్సరీ హబ్, పర్యాటకం వంటి రంగాల్లో జిల్లాకు ఉన్న సహజ బలాలు, వాటిని ఉపయోగించి ఉపాధి అవకాశాలు, అదనపు ఆదాయం సృష్టించడంపై దృష్టి సారించాలన్నారు. VER లక్ష్యమైన 2032 నాటికి గణనీయమైన జిడిపి వృద్ధి సాధనలో జిల్లా సహకారం కీలకమని కలెక్టర్ కీర్తి పేర్కొన్నారు. ప్రత్యేకంగా పౌల్ట్రీ ఫార్ముల విస్తరణ, హ్యాచరీల ఏర్పాటు, ఆక్వాకల్చర్ విస్తీర్ణం పెంపు, అరటి–ఆయిల్‌పామ్ విలువ పెంపు, నర్సరీ క్యాపిటల్‌గా తూర్పు గోదావరి అభివృద్ధి, అలాగే గోదావరి నది తీర అభివృద్ధి, పుష్కరాల దృష్ట్యా పర్యాటక మౌలిక వసతుల సృష్టి వంటి అంశాలపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. VER గ్లోబల్ ఎకనామిక్ హబ్ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని శాఖల సమన్వయంతో వేగవంతమైన అమలు, భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడేలా ప్రతి ప్రాజెక్టును కాలపరిమితిలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి, ఎస్డిసి ఎస్ భాస్కర్ రెడ్డి, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, జిల్లా పశు సంవర్ధక అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా హార్టికల్చర్ అధికారి ఎన్ మల్లిఖార్జున రావు, జిల్లా సూక్ష్మ నీటిపారుదల అధికారి ఏ దుర్గేష్, టూరిజం ఈ డి ఎన్ వి వి ఎస్ మూర్తి, జిల్లా టూరిజం అధికారి పి వెంకట చలం, డిపిటివో వై వి మూర్తి, పీఆర్ ఎస్ ఈ టి బాలకృష్ణ, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక అధికారి టివి సూర్య ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News