రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీలక్ష్మి ప్రభుత్వ బాలికల సదనాన్ని సందర్శించి అక్కడ బాలికలకు అందుతున్న వసతులు, సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా వసతి గృహంలో నివసిస్తున్న బాలికలతో సన్నిహితంగా మాట్లాడి వారి విద్య, ఆరోగ్యం, భద్రత, భోజనం, దైనందిన అవసరాలు తదితర అంశాలపై వివరాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి అడిగి తెలుసు కున్నారు. బాలికలు బాగా చదువుకుని, క్రమశిక్షణతో ముందుకు సాగి ఉన్నత స్థాయికి చేరుకొని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని ఆమె సూచించారు. వసతి గృహంలో ఆహార మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా, శుభ్రత, భద్రత, ఆరోగ్య పరిరక్షణ సక్రమంగా జరుగుతున్నాయా..? అని బాలికలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ బాలికలకు కల్పిస్తున్న వసతి, విద్యా వాతావరణం సంతృప్తికరంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీలక్ష్మి బాలికలకు మంచి స్పర్శ – చెడు స్పర్శలపై అవగాహన కల్పిస్తూ, తమపై జరిగే ఏవైనా అన్యాయాలు, వేధింపుల విషయంలో భయపడకుండా వెంటనే తెలియజేయాలని సూచించారు. బాలికల హక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాలు, ముఖ్యంగా బాలల సంరక్షణ చట్టం (POCSO), బాలల హక్కుల చట్టం, ఉచిత న్యాయ సహాయం వంటి అంశాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
వసతి గృహంలో గానీ, బయట గానీ ఎటువంటి సమస్యలు ఎదురైనా, న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను లేదా హెల్ప్‌లైన్ నెంబర్ 15100 ను సంప్రదించాలని బాలికలకు సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాలికల హక్కుల పరిరక్షణకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.
క్రమశిక్షణ, సహనశీలత, ఆత్మవిశ్వాసం ప్రతి బాలికలో పెంపొందితేనే సమాజంలో గౌరవప్రదమైన స్థానం సాధించగలరని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని అధికారులకు సూచించారు.
Prajavartha Online Telugu News