Breaking News

ఇంటి కోసం పోరాడిన మహిళకు న్యాయం

-మహిళా దినోత్సవం రోజున బాధిత మహిళకు న్యాయం చేసిన కలెక్టర్
-మానవత్వం తో పరిమళించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్యాక్రాంతం అయిన తన ఇంటిని తిరిగి పొందేందుకు పోరాడిన మహిళకు న్యాయం చేస్తూ, మరోసారి మానవత్వాన్ని చాటిచెప్పారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన పేరం విజయకుమారి గత కొన్ని నెలలుగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆమె తల్లి–తండ్రులు తన తమ్ముడి పెళ్లి కోసం నక్క లెల్లయ్య వద్ద రూ.70,000 అప్పుగా తీసుకున్నారు. అయితే ఆ అప్పు తీర్చకముందే వారు మరణించారు. అనంతరం అదనంగా రూ.2,30,000 కలిపి మొత్తం రూ.3,00,000గా బలవంతంగా పత్రం రాయించుకున్నారు. నెలకు రూ.9,000 వడ్డీగా మూడు సంవత్సరాల పాటు ఆమె చెల్లించారు. కాలక్రమంలో వడ్డీతో కలిపి మొత్తం రూ.3 లక్షలు చెల్లించినప్పటికీ, ఇంకా రూ.50,000 ఇవ్వాలని చెప్పి ఇంటి పత్రాలు తిరిగి ఇవ్వకుండా ఆ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిన విజయకుమారి తన పిల్లలతో కలిసి నాలుగు నెలల పాటు తీవ్ర ఇబ్బందులు పడుతూ, బంధువుల ఇళ్లలో తలదాచుకుంటూ జీవనం సాగించారు. చివరికి న్యాయం కోసం ఆమె జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలెక్టరేట్‌లో కలిసి అర్జీ సమర్పించారు. తన ఇంటిని తిరిగి ఇప్పించాలంటూ ఆమె చేసిన వేడుకోలు కలెక్టర్‌ను కదిలించాయి. విషయాన్ని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా వెంటనే స్పందించి, బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘ కమిషనర్‌కు ఈ నెల 7వ తేదీన (07-03-2026) విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే విచారణ చేపట్టిన అధికారులు పరిస్థితిని పరిశీలించి, నక్క యానదయ్య ఆక్రమణలో ఉన్న ఇంటిని విడిపించి, అసలు యజమాని అయిన విజయకుమారికి అప్పగించారు.

నాలుగు నెలలుగా ఇల్లు లేక ఇబ్బందులు పడిన విజయకుమారి, తనకు తిరిగి ఇల్లు అందడంతో ఆనందం వ్యక్తం చేశారు. “నాకు న్యాయం జరిగింది. నా పిల్లలతో మళ్లీ నా ఇంట్లో ఉండగలుగుతున్నాను. కలెక్టర్ గారికి జీవితాంతం కృతజ్ఞురాలిని” అంటూ ఆమె భావోద్వేగంగా స్పందించారు.

ఈ ఘటన ద్వారా బాధితుల సమస్యలపై సత్వర స్పందనతో చర్యలు తీసుకుంటే ప్రజలకు న్యాయం త్వరగా అందుతుందని మరోసారి రుజువైంది. జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యల పట్ల సానుభూతితో వెంటనే స్పందిస్తున్నారని జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.

“అప్పుల పేరుతో అమానుష వేధింపులకు చెక్‌ – వడ్డీ వ్యాపారులకు కలెక్టర్ గట్టి హెచ్చరిక” :

అప్పుల వ్యాపారం పేరుతో ప్రజలను వేధించడం, అధిక వడ్డీలు వసూలు చేయడం, బలవంతంగా పత్రాలపై సంతకాలు తీసుకోవడం వంటి అమానుష చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. అప్పు ఇచ్చిన పేరుతో పేద ప్రజలను మానసికంగా, శారీరకంగా వేధించడం, వారి ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన గట్టిగా హెచ్చరించారు.
అలాగే, ఇది ఒక్క వ్యక్తికి సంబంధించిన సమస్య మాత్రమే కాకుండా సమాజంలో చాలాచోట్ల కనిపిస్తున్న తీవ్రమైన సమస్య అని ఆయన తెలిపారు.

అప్పుల పేరుతో ప్రజలను భయపెట్టి, అవమానపరచి, ఇళ్ల నుంచి వెళ్లగొట్టడం వంటి అమానుష చర్యలకు పాల్పడే వారందరికీ ఇది గట్టి హెచ్చరికగా భావించాలని పేర్కొన్నారు. ప్రజలను వేధిస్తూ అన్యాయంగా వ్యవహరించే వారిపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తారని, బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *