-బతుకమ్మ పోటీ విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆడపిల్లలు అన్ని రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శ్రీదేవి సాంస్కృతిక, సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఆన్ లైన్ పోటీ విజేతలకు శనివారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగింది. ఈ పోటీలలో రాష్ట్ర నలుమూలల నుంచి 100 మందికిపైగా బాలికలు పాల్గొనగా.. విజయవాడ నుంచి పాల్గొని ప్రతిభ కనబరిచిన చిన్నారులు రాజ్యలక్ష్మి, ప్రజ్ఞ, అఖిల, అలేఖ్యలను ఎమ్మెల్యే గారు అభినందించారు. ఇటువంటి పోటీలతో చిన్నారులలో మానసిక ఉల్లాసం పెంపొందడంతో పాటు.. విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీయవచ్చన్నారు. ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తుకై రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ఆ అవకాశాలన్నింటినీ సద్వినియోగపరచుకొని.. బాలికలందరూ తమకు నచ్చిన రంగాలలో రాణించాలని సూచించారు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు ప్రాధాన్యతనిస్తే గొప్ప గొప్ప అధ్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. కుటుంబ స్థాయిలోనే బాలికలపై వివక్ష లేకుండా బాలురతో సమానంగా చూసేలా తల్లిదండ్రుల మానసిక స్థితిలో మార్పు రావాలన్నారు. బాలికలందరూ ఉన్నత చదువులు చదివి సమాజంలో మంచిస్థాయికి చేరుకునేలా ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. అనంతరం విద్యార్థులలో ప్రతిభను వెలికితీసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీదేవి సాంస్కృతిక, సాంఘిక సంక్షేమ సంఘం సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.