-ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ సీపీ విజయోత్సవ వేడుకలు
-కుట్రలతో ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ప్రయత్నించారు: డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి
-కుప్పంలో కుప్పకూలిన టీడీపీ కోట: కార్పొరేటర్ జానారెడ్డి
-రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయింది: కార్పొరేటర్ శర్వాణీ మూర్తి
-కుప్పం ఓటమిని అంగీకరించి చంద్రబాబు రాజకీయాల నుంచి వైదొలగాలి: కార్పొరేటర్ పెనుమత్స శిరీష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మున్సిపల్ ఫలితాల్లో వైఎస్సార్ సీపీ చరిత్ర తిరగరాసిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీని వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని తన సందేశంలో తెలియజేశారు. మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో శాసనసభ్యులు ఆదేశాల మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు పెద్దఎత్తున సంబురాలు జరుపుకున్నారు. ఆనందోత్సాహాల మధ్య బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ.. మున్పిపల్ ఎన్నికల్లో తిరుగులేని ఫలితాలు అందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ప్రజలు మరోసారి ఆశీర్వదించారని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే టీడీపీని గెలుపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందో ప్రజలే విజ్ఞతతో నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రభంజనం సృష్టించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.
వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ జానారెడ్డి మాట్లాడుతూ.. కుప్పంలో చంద్రబాబు కోట కుప్పకూలుతుందని ముందే ఊహించామని అన్నారు. కుట్రలతో ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ప్రయత్నించినా.. అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు పట్టంకట్టారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తింపజేయడం, సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా, జాప్యం లేకుండా లబ్ధి చేకూరుస్తుండడంతో ప్రజలు వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారని అన్నారు. కుప్పం అయినా విజయవాడ అయినా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని స్పష్టం చేశారు.
మరో కార్పొరేటర్ శర్వాణీ మూర్తి మాట్లాడుతూ.. ప్రజా తీర్పును గౌరవించడం చంద్రబాబుకు చేతకాదని, కనుకనే ఓటమికి సాకులు వెతికే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఏ విధంగా దౌర్జన్యం చేసిందో రాష్ట్రమంతా చూసిందన్నారు. చంద్రబాబు, నారా లోకేష్‌లను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. తండ్రీకొడుకులిద్దరూ ఏపీకి వస్తే విద్వేషాలు రెచ్చగొట్టడం, అల్లర్లు సృష్టించడం తప్ప.. ప్రజలకు మంచి చేయాలని ఏనాడూ ఆలోచించలేదని మండిపడ్డారు.
కుప్పంలో టీడీపీ ఎన్ని డ్రామాలాడినా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనకే ప్రజలంతా బ్రహ్మరథం పట్టారని కార్పొరేటర్ పెనుమత్స శిరీష అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, నిశ్శబ్దంగా బ్యాలెట్ ద్వారా బుద్ధి చెప్పారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, కొంగితల లక్ష్మీపతి, కుక్కల అనిత, కొండాయిగుంట మల్లీశ్వరి, ఇసరపు దేవి, ఉద్ధంటి సునీత, ఉమ్మడి రమాదేవి, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, గుండె సుభాషిణి, వైసీపీ డివిజన్ ఇంఛార్జిలు ఆత్మకూరు సుబ్బారావు, అంగిరేకుల నాగేశ్వరరావు, బొందిలి కార్పొరేషన్ డైరక్టర్ శైలజా, నాగవంశీయుల కార్పొరేషన్ డైరక్టర్ కాళ్ల ఆదినారాయణ, గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరక్టర్ భోగాది మురళి, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరక్టర్ పిల్లి కృష్ణవేణి, రాష్ట్ర వైసీపీ జాయింట్ సెక్రటరీ వెన్నం రత్నారావు, వైసీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.