అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణాన్ని కాపాడుకుందాం – భవిష్యత్ తరాలకు మెరుగైన భూమిని అందిద్దాం
విశాఖపట్నంలోని “అటవీ పరిశోధన, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థా కేంద్రం” సందర్శన నా విజ్ఞానయాత్రలో ముఖ్యమైనది.
-ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు
మిత్రులారా…
నేను భారత ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన నాటి నుంచి నా వివిధ పర్యటనల్లో భాగంగా భారతదేశంలో ఉన్న వివిధ విజ్ఞాన కేంద్రాల సందర్శనల ద్వారా ఎప్పటికప్పుడు “విజ్ఞాన యాత్ర”లను కొనసాగిస్తున్నాను అనే విషయం మీకు తెలిసిందే. ప్రస్తుతం విశాఖ పర్యటనలో భాగంగా ఈ రోజు బీచ్ రోడ్ లోని యోగా విలేజ్ పరిసరాల్లో ఉన్న “అటవీ పరిశోధన, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థా కేంద్రం (ఎఫ్.ఆర్.సి.సి.ఈ)”ని సందర్శించాను. ఈ సందర్శనలో భాగంగా సముద్ర పర్యావరణ వ్యవస్థలో కలప జీవ అధోకరణపై ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనా కేంద్రాన్ని ప్రారంభించాను. సముద్ర కలప జీవ అధోకరణపై దేశం మొత్తంలో ఉన్న ఏకైక పరిశోధనా కేంద్రం ఇదే కావడం విశేషం. ఈ సంస్థను సందర్శించడం ద్వారా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలపై నా అవగాహన మరింత పెరిగింది.
నేను ఈ వైజ్ఞానిక ప్రదర్శన కేంద్రాన్ని పరిశీలిస్తూ వెళుతున్నప్పుడు సముద్రపు బయో ఫౌలింగ్ కారణంగా దెబ్బతిన్న చెక్క నమూనాలు, సముద్ర జీవుల అవశేషాలు, పరిరక్షించిన చెక్క నమూనాలు తదితరాలను చూశాను. అంతే గాకుండా తూర్పుకనుమల్లో ఉన్న పక్షుల జాతులు, విశాఖపట్నం జిల్లాలోని 114 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం వెంబడి మడ అడవులతో అనుసంధానమైన పక్షుల జాతుల గురించి ఇక్కడ ఉన్న అంశాలను తిలకించాను.
విజ్ఞాన శాస్త్రం యొక్క అంతిమ లక్ష్యం ప్రజల జీవితాలను మెరుగుపరచటంతో పాటు, వారికి సౌకర్యాన్ని, ఆనందాన్ని అందించడమని నేను అనేక సందర్భాల్లో చెబుతూవస్తున్నాను. పేదరిక నిర్మూలనలో భాగంగా, సముద్ర వాతావరణంలో పాడవ్వని విధంగా కలపతో తయారు చేసిన 100 మరపడవలను ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మత్స్యకారులకు ఈ సంస్థ పంపిణీ చేసిందని తెలిసి ఎంతో ఆనందించాను.
మిత్రులారా…
వాతావరణ మార్పులు మనమంతా అంగీకరించి తీరాల్సిన వాస్తవపరిస్థితి. దీని ప్రభావం మన చుట్టూ ఉన్న జీవరాశుల మీద ఉంది. అత్యంత జీవవైవిధ్యం కలిగిన ప్రాంతాల్లో భారతదేశం కూడా ఒకటి. అడవులు, గడ్డి భూములు, చిత్తడి నేలలు, ఎడారులు, తీర మరియు సముద్ర పర్యావరణ వ్యవస్థల వంటి విస్తృత పర్యావరణ వ్యవస్థలకు నిలయంగా మన దేశం అలరారుతోంది. పట్టణీకరణ, భారీ నిర్మాణాలు, అధికంగా చేపలు పట్టడం వంటి మానవ కార్యకలాపాల వల్ల తీరప్రాంత ప్రకృతి అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. దీని ఫలితంగా పర్యావరణ వ్యవస్థల మధ్య తీవ్రమైన అసమానతలు చోటు చేసుకుంటున్నాయి.
భూతాపం కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడం, హిమనీ నదాలు కరగడం, తుఫానులు సంభవించడం, వరదలు పెరగడం వంటి సంఘటనల కారణంగా సముద్ర మట్టాల్లో పెరుగుదల నమోదు అవుతోంది. రుతుపవనాల్లో మార్పుల కారణంగా తీరప్రాంత పర్యావరణ వ్యవస్థల బయో-జియోకెమికల్ చక్రాల పనితీరు ప్రభావితం అవుతోంది. తీరప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ అటవీరంగం ఎదుర్కొంటున్న తాజా సవాళ్ళలో ఒకటి అని నాకు తెలియజేశారు. భూతాపం కారణంగా సముద్రం మట్టం పెరిగి, తీరరేఖ వెంబడి ఉన్న భూభాగం వైపు సముద్రం విస్తరిస్తోంది. ఫలితంగా నేలలో లవణీయత కూడా క్రమంగా పెరుగుతోంది. ఇది వ్యవసాయాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయడమే కాకుండా, నివాస సముదాయాల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. తక్షణమే మనకు ఎదురౌతున్న ఈ సవాళ్ళపట్ల శ్రద్ధ వహించి, తక్షణ చర్యలు చేపట్టడం అత్యంత ఆవశ్యకం. వన్యప్రాణులు, పర్యావరణ వ్యవస్థల మీద వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో ఆధునిక బయోసాంకేతిక సాధనాలు కచ్చితంగా సహాయపడతాయని నేను భావిస్తున్నాను.
అటవీ పరిశోధన, తీరప్రాత పర్యావరణ వ్యవస్థా కేంద్రం పరిశోధనలు తూర్పు, పశ్చిమ తీరాల్లోని మడ అడవులు, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలకు సంబంధించిన అటవీ జీవవైవిధ్యం, అటవీ జన్యు వనరుల నిర్వహణపై సాగుతున్నాయని తెలిసి సంతోషించాను. మడ అడవుల పర్యావరణ వ్యవస్థలు మరింత ప్రత్యేకమైనవే గాక, సమృద్ధమైన జీవవైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. పర్యావరణ పరిరక్షణకు ఎంతో తోడ్పాటును అందిస్తాయి. భారతదేశ అటవీ నివేదిక – 2019 ప్రకారం మడ అడవులు 4,975 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం 2017 అంచనాతో పోలిస్తే మడ అడవుల్లో 54 చదరపు కిలోమీటర్ల నికర పెరుగుదల ఉంది. అదేవిధంగా, దేశంలోని మొత్తం అటవీ మరియు వృక్షసంపద విస్తీరణంలో 5,188 చదరపు కిలోమీటర్ల పెరుగుదల ఉంది. దేశంలోని మొత్తం అడవులు, వృక్షాల విస్తీరణం 80.73 మిలియన్ హెక్టార్లు అని ఈ నివేదిక చెబుతోంది. ఇది దేశ భౌగోళిక విస్తీరణంలో 24.56 శాతం.
పర్యావరణ పరిరక్షణ కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇవ్వడం ఆనందదాయకం. వాతావరణ మార్పుల కారణంగా భూమికి జరుగుతున్న నష్టాన్ని తగ్గించుకోవడానికి మనం ఇంకా చేయాల్సింది చాలానే ఉందని నా అభిప్రాయం. భూపరిరక్షణలకు అవసరమైన మార్పులను తీసుకురావడానికి మార్పుల దిశగా ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. భూగ్రహ పరిరరక్షమ మన భవిష్యత్ చర్యల మీద ఆధారపడి ఉంది.
అందుకే పర్యావరణానికి హాని కలగకుండా మనం జాగ్రత్తపడాలి. మన ప్రతి చర్య భవిష్యత్ తరాల శ్రేయస్సును ప్రభావితం చేస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ తరాలకు అందమైన, సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన పర్యావరణంతో కూడిన భూభాగాన్ని అందించేందుకు మనమంతా కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను.