Breaking News

తమ భూములపై వేరె ఎవరూ సవాల్ చేయడానికి వీలు కాని శాశ్వత హక్కులు… : జె సి డాక్టర్ కె. మాధవీలత

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వామిత్వా ద్వారా దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అవినీతికి తావు లేకుండా భూలావాదేవీలు, ప్రతి భూభాగానికి విశిష్ట గుర్తింపు సంఖ్య ,భూయజమానులకు తమ భూములపై వేరె ఎవరూ సవాల్ చేయడానికి వీలు కాని శాశ్వత హక్కులు కల్పించబడ్డాయని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ . కె. మాధవీలత తెలిపారు.
బుధవారం ఉదయం ఆమె మచిలీపట్నం మండల పరిధిలోని పొట్లపాలెం గ్రామాన్ని సందర్శించారు. గ్రామ పంచాయితీ కార్యాలయంలోని రైతుభరోసా కేంద్రం వద్ద ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’ పథకం కింద జరుగుతున్న రీసర్వే కార్యక్రమం గురించి పలువురు రైతులకు వివరించారు.
కృష్ణాజిల్లాలో 4 గ్రామాలలో స్వామిత్వా పైలెట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. పొట్లపాలెం గ్రామంలో 684 ఎకరాలు 643 మంది రైతులు ఉన్నారని గతంలో ప్రతి సర్వే నెంబర్ కు పలుమార్లు రిజిస్ట్రేషన్లు జరిగి సబ్ డివిజన్ జరిగిన తర్వాత ఒక సర్వే నెంబర్ ను పార్ట్ పార్ట్ అని రికార్డులలో పదే పదే రాసుకొంటూ పోయిన పరిస్థితులు ఉండేవని ఫలితంగా 10 ఎకరాలు ఉంటే అడంగళ్ లో 12 ఎకరాలు ఉంటుందని , రిజిస్ట్రేషన్లు సైతం ఎక్కువ భూమికి జరిగిందన్నారు.
ప్రతి నివాసాన్ని,ఇంటి స్థలాలను రోవర్లతో డిజిటల్ విధానంలో కొలతలు వేశారని, యజమాని వివరాలను కంప్యూటర్లలో నమోదు చేసి..ఇంటి హక్కుల టైటిల్స్ సిద్ధం చేసి ఏళ్లుగా నివాసం ఉంటున్నా ఎలాంటి ధ్రువీకరణలేని వారికీ రీ సర్వే ద్వారా సదరు ఆస్తులపై హక్కులు ఏర్పరచినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.
పొట్లపాలెం గ్రామంలో 684 ఎకరాలను స్వామిత్వా ప్రాజెక్ట్ రీ -హేబిటేషన్ రీ సర్వే చేశామని , అలాగే జన నివాసిత ప్రాంతాలలో 244 గృహాలు గుర్తించినట్లు అలాగే పలు ఖాళీ స్థలాలు సైతం గుర్తించినట్లు ఆమె చెప్పారు. గతంలో ఇనుప గొలుసు విధానంలో సర్వే చేసేవారని ఇపుడు ఉపగ్రహ సాయంతో ఖచ్చితమైన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డ్రోన్, కార్స్, రోవర్ వంటి పరికరాలను ఉపయోగిస్తూ ప్రతి స్థిరాస్తిని కచ్చితమైన భూ అక్షాంశ – రేఖాంశాలతో గుర్తించి కొత్తగా సర్వే, రెవెన్యూ రికార్డులు రూపొందించబడ్డాయన్నారు. ప్రతి నివాసిత కుటుంబానికి ల్యాండ్ టైటిల్ ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ ల్యాండ్ టైటిల్ తో భూయజమానులు పలు ప్రయోజనాలు పొందవచ్చన్నారు. ఆ టైటిల్ బ్యాంకులో ఉంచి రుణం , విద్యా సంబంధిత రుణం పొందే అవకాశం ఒనగూరినట్లు తెలిపారు. గతంలో చాలామంది గ్రామ కంఠంలో నివసిస్తూ ఉండేవారని, వారికి అధికారక పూర్వకంగా ఎటువంటి డాక్యుమెంట్ ఉండేది కాదన్నారు . ఇప్పుడైతే, పొట్లపాలెం గ్రామంలో ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం ఇస్తారని రెవెన్యూ రికార్డులు, ఇతర వివరాలు గ్రామాల్లో డిజిటల్ రూపంలో కూడా అందుబాటులో ఉంటాయిని ఆమె చెప్పారు. సరిహద్దులలో కానీ కొలతలతో ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటే స్వామిత్వా బృందం ఆరోపించిన యజమాని వద్దకు వెళ్లి భూ కొలతలు చూపించి వారి సందేహాలు నివృత్తి చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె .మాధవీలత పేర్కొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *