విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగనన్న విద్యా దీవెన పధకం కింద ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇంతవరకు 201. 10 కోట్ల రూపాయలు అందించినట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. జగనన్న విద్య దీవెన పధకంలో మూడవ విడత ఫీజు రీయింబర్సుమెంట్ మొత్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుండి మంగళవారం బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేసారు. సదరు కార్యక్రమాన్ని స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు, ప్రజాప్రనిధులు, అధికారులు, విద్యార్థులు, వారి తల్లితండ్రుల వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ పేదరికం విద్యకు అడ్డుకాకూడదన్న సదుద్దేశ్యంతో రాష్ట్రంలోని పేద విద్యార్థినీ,విద్యార్థులకు ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్సుమెంట్ పధకాన్ని అమలు చేస్తున్నదన్నారు. జగనన్న విద్యా దీవెన పధకం కింద ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మొదటి విడత 92 వేల 265 మంది విద్యార్థులకు 66. 48 కోట్ల రూపాయలు, రెండవ విడతలో 93 వేల 189 మంది విద్యార్థులకు 68. 14 కోట్ల రూపాయలు, మూడో విడతలో 93 వేల 951 మంది విద్యార్థులకు 67. 31 కోట్ల రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేశామన్నారు. నాల్గవ విడత ఫీజు రీయింబర్సుమెంట్ ను 2022 ఫిబ్రవరి నెలలో విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఖాతాలలో డబ్బులు జమ ఐన వారం, పదిరోజులలో సంబంధిత కళాశాలల ఫీజు చెల్లించి, ఆ కళాశాలలో విద్యా, మౌలిక వసతులు పరిశీలించాలన్నారు. ఆయా కళాశాలలో విద్యాభ్యాసం, వసతులు గాని సరిగ్గా లేకపోతే 1092 టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు జగనన్న విద్యా దీవెన పధకం ద్వారా తాము ఏ విధంగా విద్యాభివృద్ధిలో ముందడుగు వేస్తున్నదీ తెలియజేసారు.
జగనన్న విద్యా దీవెన నాకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తోంది: షేక్ హసీనా : తాను విజయవాడ కృష్ణవేణి కళాశాలలో పాలిటెక్నిక్ కళాశాలలో ఈ.సి.ఈ. అభ్యసిస్తున్నానని తెలిపింది. తన తండ్రి చిరుద్యోగి అని, చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నడని, తమ కుటుంబం పేదరికం కారణంగా ఉన్నత విద్యాభ్యాసానికి నోచుకోలేకపోతున్నాననే దిగులు చెందుతుండగా, జగనన్న విద్యా దీవెన పధకం తమ జీవితంలో వెలుగులు నింపిందన్నారు. జగనన్న విద్య దీవెన పధకం కింద సంవత్సదరానికి 25 వేలు,. వసతి దీవెన పధకం కింద 15 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. పాలిటెక్నిక్ అనంతరం మరిన్ని ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొంది తమ తల్లితండ్రులకు, కుటుంబానికి అండగా ఉంటానని తెలిపింది. చదువుకోవాలని కోరిక ఉండి , కుటుంబ ఆర్ధిక పరిస్థితుల కారణంగా కలను నెరవేర్చుకోలేని మాలాంటి వారి జీవితాలలో జగనన్న విద్యా దీవెన పధకం వెలుగులు నింపుతున్నదన్నారు.
నా ఉన్నత విద్యాభ్యాసం కలను జగనన్న విద్యా దీవెన పధకం తీర్చింది: పొడుగు యామిని : కె. ఈ . పాలిటెక్నిక్ కళాశాలలో ఈ.సీ.ఈ చదువుతున్న పొడుగు యామిని తన తండ్రి కిషోర్ కుమార్ చిన్న దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారని తెలిపింది. ఉన్నత చదువులు అభ్యసించాలన్న కొరిక ఉన్నా, కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్య కలగా మిగులుతుందేమోనని అనుకున్నానని, కానీ జగనన్న విద్యా దీవెన పధకం ద్వారా తన కల నెరవేరుస్తున్న రాష్ర ప్రభుత్వానికి తన కృతఙ్ఞతలు తెలిపారు.
ఉన్నత స్థాయి ఉద్యోగం పొంది నా కుటుంబానికి అండగా ఉంటా : చిగురుపాటి దివ్య : విజయవాడ మాంటిసోరి కళాశాలలో బి.ఎస్సీ చదువుతున్న చిగురుపాటి దివ్య మాట్లాడుతూ తన తండ్రి ఒక సామాన్య రైతు అని చెప్పింది. కుటుంబ ఆర్ధిక పరిస్థితి నేపథ్యంలో తనను ఉన్నత చదువు చెప్పించే స్థోమత తన తండ్రికి లేదని, ఆ కారణంతో ఉన్నత విద్య అభ్యసించాలనే కోరిక కలగా మిగిలిపోతుందనుకున్నానని చెప్పింది. జగనన్న విద్యా దీవెన పధకం తనకు విద్యపై ఉన్న ఆసక్తిని నెరవేర్చిందని, ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉన్నత విద్య అభ్యసించి, మంచి ఉద్యోగం సాధించి తన కుటుంబానికి అండగా ఉంటానని ఎంతో ఆనందంతో చెప్పింది.
మా కుటుంబం పేదరికాన్ని జగనన్న విద్యా దీవెన పధకం ద్వారా జయిస్తా : షేక్ సల్మా : విజయవాడ మాంటిసోరి కళాశాలలో బి.ఎస్సీ చదువుతున్న షేక్ సల్మా తమ కుటుంబం పేద కుటుంబమని, తన తండ్రి రోజు కూలీగా పనిచేస్తున్నారని తెలిపింది. వేల రూపాయలు ఖర్చు చేసి ఉన్నత విద్యనభ్యసిస్తానని కలలో కూడా ఊహించలేదన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పధకం ద్వారా అందించిన ప్రోత్సాహంతో ఉన్నత విద్యాభ్యాసం చేసి పేదరికాన్ని జయిస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.
కార్యక్రమంలో శాసనసభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్, కొక్కిలగడ్డ రక్షణనిధి, దూలం నాగేశ్వరరావు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ కె. మోహన్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సరస్వతి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డిడి లక్ష్మి దుర్గ, ప్రభృతులు పాల్గొన్నారు.