విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ప్రతీ ఒక్కరికీ హెచ్ఐవిపై మరింత అవగాహన పెంచటంతో పాటు హెచ్ఐవి సోకిన ప్రతీ ఒక్కరికీ నాణ్యమైన మెరుగైన సేవలు అందిస్తున్నామని ఏపీశాక్స్ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఉమాసుందరి అన్నారు. స్థానిక విజయవాడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆంప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యాన విలేకరుల సమావేశం జరిగింది . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిడ్స్ దినం సందర్భంగా ఇచ్చిన నినాదం ‘అంతం చేద్దాం అసమానతలను , ఎయిడ్స్ ను , మహమ్మారులను’ ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో జీవిస్తున్న వారి కోసం ఉచితంగా స్నేహపూర్వక సేవలను అందిస్తుందన్నారు. ఎయిడ్స్ నియంత్రణ మండలి కృషి ఫలితంగా జిల్లాలో హెచ్ఐవి బారిన పడేవారి సంఖ్యతో పాటు మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గించగలిగామన్నారు . రాష్ట్రంలో లక్షా 91 వేల మందికి ఏఆర్టీ కేంద్రాల ద్వారా చికిత్సను అదిస్తున్నామన్నారు. హెచ్ఐవి సోకిన వారికి చికిత్సను అందించటంతో పాటు హెచ్ఐవి నివారణ చర్యలను సైతం ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిస్తున్నామన్నారు . 2015-16లో 9.5 లక్షల గర్భిణీలకు పరీక్షలు నిర్వహించగా 997 మందిని పాజిటివ్ గా గుర్తించటం జరిగిందన్నారు. 2020-21లో 8.4 లక్షల గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించగా కేవలం 585 మందికి ( 0.07 శాతం ) మాత్రమే హెచ్ఐవి ఉన్నట్లు తేలిందన్నారు. రాష్ట్రంలో 1936 కౌన్సిలింగ్, టెస్టింగ్ కేంద్రాల ద్వారా ‘ హెచ్ఐవి పరీక్షలు నిర్వహిస్తున్నామని , 45 ఏఆర్టీ చికిత్స కేంద్రాల ద్వారా లక్షా 90 వేల మందికి ఉచితంగా ఏఆర్టీ మందులు అందజేస్తున్నామన్నారు. అలాగే హెచ్ఐవితో పాటు క్షయ, సుఖవ్యాధులను గుర్తించి చికిత్స అందజేస్తున్నామన్నారు. వైఎస్ఆర్ పెన్సన్ కానుకద్వారా 32 వేల హెచ్ఐవి రోగులకు లబ్ధి కలుగుతుందని మరో 88 వేల మందికి పెన్సన్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆరంభదశలోనే హెచ్ఐవి గుర్తించి త్వరితగతిన చికిత్స అందించటంతో పాటు వైరల్ లోడ్ తగ్గించేందుకు పనిచేస్తున్నామన్నారు . అత్యాధునిక మందుల ద్వారా హెచ్ఐవి నియంత్రణకు కృషి చేస్తున్నట్లు వివరించారు. కోవిడ్ సమయంలో వారికి సమీపంలోని ఆరోగ్యకేంద్రాలలో చికిత్సను అందించామన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా సేవలు అందించటం వల్ల దశాబ్దకాలంలో 70 శాతం మరణాలను తగ్గించగలిగామన్నారు. ఏపీశాక్స్ సీఎ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఉమాదేవి మాట్లాడుతూ హెచ్ఐవి సోకిన వారికి త్వరితగతిన చికిత్సను ఏఆర్టీ సెంటర్ల ద్వారా అందిస్తున్నామన్నారు. గతంతో పోలిస్తే అత్యాధునిక మందులు అందుబాటులోకి రావటం జరిగిందన్నారు . ప్రభుత్వ సేవలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకుని హెచ్ఐవి రహిత సమాజ స్థాపనకు సహకరించాలని కోరారు . తెలుగు పాజిటివ్ నెట్వర్క్ నుంచి ఎం. రామ్మోహన్ రావు మాట్లాడుతూ తాను 21 సంవత్సరాలుగా హెచ్ఐవితో జీవిస్తున్నానన్నారు. మానసిక ధైర్యం , ఏఆర్టీ చికిత్స ద్వారా జీవన ప్రమాణం పెంచుకోవచ్చని అన్నారు. జిల్లా అధనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జూపూడి ఉషారాణి జిల్లాలో హెచ్ఐవి సేవలను వివరించారు . కార్యక్రమంలో ఏపీశాక్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రకాష్ , డీపీఎం కిరణ్ పందిటి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …