-ప్రత్యేక హోదాపై సంతకం వాగ్ధానం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం
-పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
-ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
2024లో దేశంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయమని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ నాడు గుంటూరు, తిరుపతి సభల్లోనూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదాపై సంతకం వాగ్ధానం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే సాధ్యమవుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం అనంతపురం లో డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా సభ్యత్వాలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ఈసారి డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగిందన్నారు. పార్టీలోని సభ్యులు అందరితో నేరుగా ప్రత్యక్షంగా సంబంధాలను కొనసాగించడంలో భాగంగా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజలు అధికంగా పాల్గొని పార్టీ తీసుకునే నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం కార్యకర్తలు అందరికీ కూడా కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా, నగర, పట్టణ, మండల కాంగ్రెస్ కార్యవర్గసభ్యులు అందరూ అన్ని స్థాయిలలోని పార్టీ నాయకులు విరివిగా పాల్గొని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కృషి చేయాలని కోరారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపరిచేందుకు ఇదొక మంచి అవకాశం అన్నారు. సభ్యత్వ నమోదు అనంతరం జరిగే ఎన్నికల ప్రక్రియలో రాహుల్ గాంధీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీని జాతీయ స్థాయిలో ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం ఒక్క కాంగ్రెస్ పార్టీకి, ప్రధానంగా రాహుల్ గాంధీ కే ఉందన్నారు. ఈ నేఫధ్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు రాష్ట్ర ప్రజలు పెద్ద సంఖ్యలో సభ్యత్వం తీసుకుని కాంగ్రెస్ పార్టీ ని ఆశీర్వదించాలని శైలజనాథ్ కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ చైర్మన్ దాదా గాంధీ తదితరులు పాల్గొన్నారు.