అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వి.ఐ.టి – ఎ.పి విశ్వవిద్యాలయంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను వర్చ్యువల్ విధానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పద్మజ చుండూరు (మ్యానేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, ముంబై) మరియు గౌరవ అతిధి గా జి. ముతళగి (విఐటి పూర్వ విద్యార్థిని మరియు చైర్మన్, విటా) పాల్గొన్నారు .
ముఖ్య అతిధి పద్మజ చుండూరు మాట్లాడుతూ సామాజికంగా, వ్యక్తిగతంగా సమాజంలో ఎదిగేందుకు మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉండాలని తెలియచేసారు. మహిళలు శక్తికి ప్రతిరూపాలని, సమయ పాలనా, నిర్ణయాధికారాలతో సమాజంలో మహిళా అభివృద్ధి సాధ్యమని అన్నారు.
గౌరవ అతిధి జి. ముతళగి మాట్లాడుతూ 111వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను గురించి తెలియచేసారు. పనిచేసే మహిళలు పనిని, జీవితాన్ని సంతులనం చేసుకుంటూ ముందుకు సాగటమే జీవితంలో విజయానికి కీలకమని తెలిపారు. మీపై నమ్మకం ఉంచి మహిళా సమానత్వం కోసం పాటుపడాలని అన్నారు. విఐటి -ఏపి విశ్వవిద్యాలయం మహిళా సమానత్వం కోసం కృషి చేయటం సంతోషంగా ఉందని తెలియచేసారు .
డా || జి. విశ్వనాథన్, ఫౌండర్ మరియు ఛాన్సలర్ – విఐటి, మాట్లాడుతూ పంచాయతీలలో మరియు పార్లమెంటులో మహిళలకు 1/3 వంతు ప్రాతినిధ్యాన్ని అందించడానికి అన్ని పార్టీలకు సంబందించిన పురుషులు సహకరించాలని కోరారు. విఐటి యొక్క యూనివర్సల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా బాలికలకు ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో 7,000 మందికి ఉన్నత విద్యలో ఉపకార వేతనాలు అందిస్తున్నామని తెలియచేసారు. ఇటువంటి ఉపకార వేతనాలు అందించి బాలికల విద్యకు చేయూతనిస్తే బాల్య వివాహాలను నిర్ములించి సమాజంలో మహిళల ఉన్నతకి తోడ్పాటు అందించవచ్చని తెలియచేసారు . ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు, సిబ్బంది, అధ్యాపకులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా||. ఎస్. వి. కోటా రెడ్డి, రిజిస్ట్రార్ డా || సి. ఎల్. వి. శివకుమార్ , డిప్యూటీ డైరెక్టర్ స్టూడెంట్ వెల్ఫేర్ డా || అనుపమ నంబూరు, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News