-తక్కువ స్థలం ఉన్న ప్రాంతాల్లో ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ లు నిర్మిస్తున్నాం..
-రాష్ట్రంలో 86 శాతం మంది ప్రజలు అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారు..
-విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 4 విద్యుత్ సబ్ స్టేషన్ లు మంజూరు చేసాం..
-రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి డిమాండ్ నకు అనుగుణంగా 24/7 గంటలు నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు అందిస్తామని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.
విజయవాడ మధురానగర్ లోని ట్రెండ్ సెట్ మెడోస్ వద్ద రూ. 3.6 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న 33/11 కె.వి. సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి శ్రీనివాస రెడ్డి బుధవారం శంకుస్థాపన చేసారు. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ వేసవిలో విద్యుత్ వినియోగానికి విద్యుత్ సరఫరా నిరాటంకంగా అందిస్తామని ఎటువంటి విద్యుత్ అంతరాయం ఉండదని అన్నారు. అదనపు విద్యుత్ కొరకు యూనిట్ రూ. 9 రూపాయలకు కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ఇటీవల సమీక్షించారని, వేసవిలో ఎటువంటి పవర్ కట్ లేకుండా నిరాటంకంగా ప్రజలకు విద్యుత్ సరఫరా అందాలని అవసరమైతే అదనంగా విద్యుత్ ను కొనుగోలు చేయాలని ఆదేశించారని మంత్రి అన్నారు.
గత ప్రభుత్వంలో విద్యుత్ రంగంలో రూ. 26 వేల కోట్ల అప్పులను తమ ప్రభుత్వం తీర్చిందని, విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 86 శాతం మంది ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారన్నారు. ఏప్రిల్ నుండి గడప గడప కూ అనే ప్రభుత్వ నినాదంతో శాసన సభ్యులందరూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్తారన్నారు. 86 శాతం మంది ప్రజలకు లబ్ది అందించామనే ధైర్యంతో ప్రతి శాసన సభ్యులు ప్రజలతో మమేకమవుతున్నారన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రజారంజకమైన పథకాలే మా ప్రభుత్వానికి శ్రీ రామ రక్ష అని, వచ్చే ఎన్నికల్లో 150 కు పైగా సీట్లు గెలుస్తామన్నారు. బడ్జెట్ లో అభివృద్ధి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని రానున్న రెండు సంవత్సరములలో అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి శ్రీనివాస రెడ్డి అన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు, లో ఓల్టేజ్ సమస్య పరిష్కారానికి నాలుగు విద్యుత్ సబ్ స్టేషన్ లు మంజూరు చేశామన్నారు. శంకుస్థాపన చేసిన సబ్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని విద్యుత్ శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. నగరాల్లో సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థల సమస్య ఏర్పడుతుందని స్థలం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ‘ ఇండోర్ సబ్ స్టేషన్ ‘ లు నిర్మిస్తామని మంత్రి అన్నారు. విద్యుత్ సరఫరాను దృష్టిలో పెట్టుకుని విజయవాడ నగరంలో అదనంగా సబ్ స్టేషన్ లు మంజూరు చేస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ రూ. 3.6 కోట్లతో నిర్మించనున్న 33/11 కె.వి. సబ్ స్టేషన్ పూర్తి అయితే ట్రెండ్ సెట్ మెడోస్, దేవీనగర్, దావు బుచ్చయ్య కాలనీ, జి.వి.ఆర్. నగర్, వినాయక నగర్, పప్పులమిల్లు ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తామని లో ఓల్టేజ్ సమస్యలు ఉండవన్నారు. అత్యాధునిక టెక్నాలజీ తో నిర్మిస్తున్న సబ్ స్టేషన్ వలన విద్యుత్ అంతరాయాలను తగ్గించవచ్చునన్నారు. ప్రజల మీద భారం లేకుండా తమ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ ను ప్రజలకు అందిస్తుందని మల్లాది విష్ణువర్ధన్ అన్నారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డిలు మాట్లాడుతూ నగర విస్తీర్ణం పెరుగుతుందని అందుకు అనుగుణంగా విద్యుత్ శాఖ మౌలిక సదుపాయాలు, నూతన విద్యుత్ సబ్ స్టేషన్ లు మంజూరు చేయాలని ఇంధన శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కోరారు.
ఈ సమావేశంలో ఏపిసిపిడిసిఎల్ చైర్మన్ మరియు సూపెరింటెండింగ్ ఇంజనీర్ శివ ప్రసాద్ రెడ్డి, డి.ఇ. లు నరేంద్ర, వసంతరావు, కార్పొరేటర్ లు, విద్యుత్ శాఖాధికారులు, ప్రజలు పాల్గొన్నారు.