Breaking News

అసమాన ప్రవచన చక్రవర్తి ‘బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు’: ఎమ్మెల్యే మల్లాది విష్ణు


-సమస్త ప్రాణులందు ఆ జగన్మాత చైతన్య రూపంలో ప్రకాశిస్తోంది: బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర‌రావు
-దేవీ వైభవతత్వంపై చాగంటి కోటేశ్వరరావు అమృత ప్రవచనాలు
-అశేషంగా తరలివచ్చిన భక్తజనం
-మల్లాది వేంకట సుబ్బారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
-చాగంటి వారి ప్రవచనాలు స్ఫూర్తిదాయకం: దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భ‌క్తి త‌ల్లి లాంటిద‌ని, భ‌క్తితో ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటార‌ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణం నందు దేవీవైభవతత్వంపై చాగంటి కోటేశ్వరరావుచే ప్రవచన కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. మల్లాది వేంకట సుబ్బారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. రెండు రోజుల పాటు జరిగే ప్రవచన కార్యక్రమంలో భాగంగా అశేష భక్తజన వాహినికి దేవీ వైభవతత్వాన్ని ప్రవచనములతో బోధించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉపన్యసిస్తూ.. అమ్మవారిని ఉపాసన చేయడమంటే, అమ్మను పూజించటమేనని వ్యాఖ్యానించారు. అటువంటి తల్లికి చేసే ప్రదక్షిణం.. భూమికి ఆరుమార్లు చేసే ప్రదక్షిణాలతో సమానమన్నారు. రూపాలన్నింటిలో ఒక్క తల్లిరూపంలోనే అమ్మవారు విశేషంగా ప్రకాశిస్తుందని.. సమస్త ప్రాణకోటి ఆ జగన్మాతకు బిడ్డలేనని వివరించారు. ధర్మం అనే పదానికి తుల్యమైన పదం మరొకటి లేదని.. ధర్మాన్ని ఆచరించే వారిని ఆ తల్లి ఎల్లవేళలా ఉద్దరిస్తుందన్నారు. కేవలం చూపులతోనే ఆ లోకమాత సమస్త జీవకోటిని పోషిస్తోందని తెలియజేశారు. త్యాగానికి, ఓదార్పుకు ప్రతిరూపం అమ్మ అని.. తల్లిని గౌరవించే వారు ఉన్నత‌మైన స్థితికి చేరుకుంటార‌ని తెలిపారు.

భార‌తీయ జీవ‌న విధానం వేద సంస్కృతితో ముడిప‌డి ఉంద‌ని, వేదం భ‌క్తిమార్గాన్ని బోధిస్తుంద‌ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలియ‌జేశారు. వేదం భగవంతుని స్వరూపమని, విశ్వమాన‌వ శ్రేయ‌స్సు కోస‌మే భ‌గ‌వంతుడు వేదాల‌ను సృష్టించాడ‌ని ఉద్ఘాటించారు. వేదోక్తంగా ఆచ‌రించే క‌ర్మల‌న్నీ ధ‌ర్మబ‌ద్ధమైన‌వని, శాస్త్రీయ‌మైన‌వని పేర్కొన్నారు. ధ‌ర్మానికి మూలం వేదాలేన‌న్నారు. ప్రతి ఒక్కరూ ధ‌ర్మబ‌ద్ధంగా కోరిక‌లు తీర్చుకోవాల‌ని, అప్పుడే ఆత్మజ్ఞానం క‌లుగుతుంద‌ని వివ‌రించారు. ఆత్మజ్ఞానంతో భ‌గ‌వంతుని ఆరాధిస్తే మోక్షం సిద్ధిస్తుంద‌న్నారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. విజ్ఞాన సారాన్ని దైనందన జీవిత విధివిధానాలతో జోడించి సామాన్య పద ప్రయోగాలతో జన హృదయాలకు తాకేటట్లు మాట్లాడటం చాగంటి వారికే చెల్లిందన్నారు. తన ప్రవచన ధారలతో చాగంటి వారు సమాజంలో మార్పు తీసుకువస్తున్నారని, తాను కూడా ఆ ప్రవచనాలను వింటూ ఎంతో స్ఫూర్తిని పొందుతున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. తన వాక్పఠిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకోవడంతో పాటు బ్రహ్మశ్రీ అని గౌరవ నామాన్ని చాగంటి వారు పొందారన్నారు. ఆయన ప్రవచనాలు విన్నవారి మనసులని హత్తుకునేవిగా, ఆలోచింపజేసేవిగా ఉంటాయన్నారు. భారతీయ సంస్కృతిక, సాంప్రదాయం, ఆధ్యాత్మికతలను పెంపొందిస్తూ.. వాటి పరివ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్న చాగంటి వారి జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్లు అవుతు శ్రీ శైలజా రెడ్డి, బెల్లం దుర్గ, నగర వైఎస్సార్ సీసీ కార్పొరేటర్లు, అశేష భక్త జనం పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *