-ఎలాంటి సంక్షోబాన్నైనా అధిగమిస్తాం
-24x 7 కరెంటు సరఫరా కు ఢోకా లేకుండా చేస్తాం
-ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
-దేశంలో బొగ్గు కొరత దృష్ట్యా జులై – ఆగష్టు-2022 మధ్య మరోసారి విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం
-రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ప్రణాళికలు రూపొందించండి.
-అధికారులకు ఇంధన శాఖ మంత్రి ఆదేశం
-విద్యుత్ రంగంలో ప్రజాసంక్షేమం విషయంలో రాజీపడేదే లేదు
-ఎంత డిమాండ్ పెరిగిన అందుకుంటాం .. ఎంత ఖర్చైనా వెనుకాడం
-బొగ్గు ఉత్పత్తి సరఫరా పై నైరుతి ఋతుపవనాల ప్రభావం
-వర్షాల ప్రారంభానికి ముందే థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పెరగాలి.. లేకుంటే సంక్షోభం తప్పకపోవచ్చు — జాతీయ స్థాయి పరిశోధక సంస్థ హెచ్చరిక
-31 లక్షల టన్నుల బొగ్గు దిగుమతులకు విద్యుత్ సంస్థలు ఏర్పాటు
-రాష్ట్రానికి బొగ్గు సరఫరా చేసేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ ప్రతిపాదన
-గ్రీన్ ఎనర్జీ ప్రోజెక్టుల పెట్టుబడులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది
-కర్నూల్ జిల్లాలో 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన స్టోరేజీ ప్రాజెక్టు
-సంక్షోభ సమయంలో విద్యుత్ సంస్థలకు అండగా నిలుస్తాం
-రాష్ట్ర విద్యుత్ రంగాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దెందుకు కృషి
-అన్ని రంగాల్లో ఇంధన సామర్ధ్యాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోండి.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తీవ్ర మైన బొగ్గు కొరత, సంక్షోభం దృష్ట్యా వచ్చే జులై ఆగష్టు-2022 మధ్య దేశంలో మరోసారి విద్యుత్ కొరత ఏర్పడుతుందనే సూచనల నేపథ్యంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఇంధన, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆదేశించారు. విద్యుత్ రంగంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికి 24x 7 నాణ్యమైన,నమ్మకమైన విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
అలాగే బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడం పై విద్యుత్ సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్దిష్ట గడువు ప్రకారమే ఈ ప్రోజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలనీ ఆయన పేర్కొన్నారు . దీని వల్ల రాష్ట్ర విద్యుత్ రంగాన్ని పర్యావరణ హితంగా మార్చేందుకు కూడా మార్గం సులభతరం అవుతుందన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జరిగిన టెలీకాన్ఫెరెన్స్ లో విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు ఇంధన శాఖ కార్యదర్శి , బీ శ్రీధర్, జె ఎం డీ, హెచ్ ఆర్ డీ/ అడ్మిన్/ఏ పీ ట్రాన్స్కో , ఐ పృధ్వి తేజ్, డిస్కమ్‌ల సి ఎం డీ లు, హెచ్ హరనాథరావు, జె పద్మా జనార్ధన రెడ్డి, కె సంతోషరావు,, వీసి /ఎండీ నెడ్క్యాప్ , ఎస్ రమణా రెడ్డి, డైరెక్టర్ గ్రిడ్, ఏ వీ కె భాస్కర్ తదితర సీనియర్ అధికారులను ఉద్దేశించి ఇంధన శాఖ మంత్రి మాట్లాడారు. నైరుతి ఋతుపవనాలు ప్రారంభం కానున్న దృష్ట్యాదేశం లోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తగినంతగా బొగ్గు నిల్వలు పెంచడం పై తీవ్ర అనిశ్చితి నెలకొందన్నారు. వర్షాలు ప్రారంభమైతే బొగ్గు తవ్వకం, అక్కడ నుండి థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా పై ప్రభావం పడుతుందన్నారు . వర్షాల ప్రారంభానికి ముందే బొగ్గు నిల్వలు తగినంతగా పెరగని పక్షంలో వచ్చే జులై ఆగష్టు నెలల మధ్యలో దేశంలో మరో సారి విద్యుత్ సంక్షోభం నెలకొనే అవకాశం ఉందని ఇటీవల ఒక జాతీయ స్థాయి పరిశోధనా సంస్థ వెల్లడించిన విషయాన్నీ మంత్రి గుర్తు చేసారు .
ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ లో ఏ మాత్రం పెరుగుదల కనిపించిన దానిని అందుకునే స్థితిలో దేశంలో థర్మల్ విద్యుత్ సంస్థలు లేవన్నారు . తీవ్ర మైన్ బొగ్గు కొరత దీనికి కారణం అన్నారు . అదే సమయంలో దేశంలో విద్యుత్ డిమాండ్ ఆగష్టు లో 214 గిగావాట్లకు చేరే అవకాశం ఉందన్నారు. దేశంలో గత సంవత్సరంలో 1500 మిలియన్ టన్నులు బొగ్గు తవ్వి తీయగల సామర్థ్యం ఉన్నప్పటికీ , కేవలం 777 మిలియన్ టన్నులు మాత్రమే బొగ్గు ఉత్పాదన జరిగింది . అనగా మొత్తం బొగ్గు ఉత్పాదక సామర్థ్యంలో సగం మాత్రమే ఉత్పాదన చేయటం జరిగింది. దేశం లో మరో రెండేళ్లవరకు బొగ్గు నిల్వ పరిస్థితులు మెరుగయ్యే అవకాశం లేదని , ఈ దృష్ట్యా 10 శాతం బొగ్గు విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాలకు సూచించింది .
ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించేందుకు మన విద్యుత్ సంస్థలు తగిన ప్రణాళికతో సంసిద్ధంగా ఉండాలని ఇంధన శాఖ మంత్రి విద్యుత్ సంస్థలను ఆదేశించారు.
విద్యుత్ ఉత్పత్తి 2040 నాటికి దాదాపు 3000 బిలియన్ యూనిట్లుగా ఉంటుందని అంచనా వేస్తూ, అలాగే అదే సమయానికి భారతదేశ ఇంధన డిమాండ్ రెట్టింపు అవుతుందని కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక లో పేర్కొంది. ఈ డిమాండ్‌ను తీర్చడానికి, 2040 నాటికి థర్మల్ బొగ్గు డిమాండ్ దాదాపు 1500 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వేయటం జరిగిందన్నారు.
జాతీయ స్థాయిలో విద్యుత్ రంగాలో జరుగుతున్న మార్పులను ఎప్పటికపుడు గమనించి రాష్ట్రం పై పడే ప్రభావాన్ని అంచనా వేసి అందుకు అనుగుణంగా, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని విద్యుత్ సంస్థల అధికారులకు మంత్రి సూచించారు .
థర్మల్ ఉత్పత్తిని పెంపొందించడానికి దిగుమతి చేసుకున్న బొగ్గును పొందేందుకు ముందస్తు చర్యలు తీసుకున్న ఏపీ జెన్‌కో ప్రయత్నాలను మంత్రి అభినందించారు. ఎంత వ్యయం అయినా 24×7 విద్యుత్ సరఫరాలో ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సర్వ సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు
ఏపీజెన్కో , ఏపీపీడీసిఎల్(ఏ పీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ) 31 లక్షల టన్నుల బొగ్గును విదేశాల నుండి దిగుమతి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి . రాష్ట్రానికి బొగ్గును సరఫరా చేసేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది . మరో వైపు పునరుత్పాదక ఇంధన రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవల దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు లో పునరుత్పాదక రంగంలో రూ 1. 25 లక్షల కోట్ల పెట్టుబలకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షం లో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది .
అలాగే కర్నూల్ జిల్లాలో 5230 మెగావాట్ల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ రెన్యుబుల్ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేస్తున్నారు . అలాగే 33,240 మెగావాట్ల సామర్థ్యం తో 29 పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టులకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో జల, పవన, సౌర ప్రాజెక్టులు ఒకే చోట ఒకే లొకేషన్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది . దీని వలన 24x 7 విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేతం అవుతుంది. రాష్ట్ర విద్యుత్ రంగాన్ని పర్యావరణ హితంగా మార్చే క్రమంలో ఇలాంటి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రం ఇంధన భద్రత సాధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఒకే చోట సౌర, పవన , విద్యుత్ స్టోరేజీ ప్రోజెక్టుగా దీనిని ఏర్పాటు చేయడం విశేషం.
రానున్న రోజుల్లో బొగ్గు కొరత వల్ల విద్యుత్ సరఫరా లో ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించి వినియోగదారులకు 24×7 విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా వచ్చిన తీవ్ర విద్యుత్ కొరత సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధిగమించిందన్నారు. గృహ విద్యుత్ వినియోగ రంగానికి 24x 7, వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ ను విజయవంతంగా అందించినట్లు చెప్పారు.అలాగే పరిశ్రమల పై విధించిన ఆంక్షలను కూడా త్వరగానే ఎత్తివేసినట్లు తెలిపారు . అలాగే 24 X 7 విద్యుత్ సరఫరా ను కోసాగించేందుకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనకాడబోదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి , విద్యుత్ రంగం సుస్థిరతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు . వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ ను కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ ప్రయత్నం లో ఆర్థికంగా ఎలాంటి కష్ట నష్టాలూ ఎదురైనప్పటికి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు .
రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని దీనికి అనుగుణంగా విద్యుత్ సంస్థలను తీర్చిదిద్దుతామని మంత్రి స్ఫష్టం చేసారు. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ , అంత మేర విద్యుత్ సరఫరాను కొనసాగించటమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు . అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సెకి) తో 7000 మెగావాట్ల ఉత్పాదక విద్యుత్ కొనుగోలుకు తక్కువ ధరకే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. దీని వల్ల రాబోయే 25 ఏళ్ళ పాటు వ్యవసాయ విద్యుత్ సరఫరా కు ఢోకా ఉందబోదని స్పష్టం చేసారు.
అలాగే రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఇంధన సామర్థ్యం , ఇంధనం పరిరక్షణ కార్యక్రమాలు అమలు చేయాలని ఇంధన శాఖ ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి విద్యుత్ సంస్థలకు సూచించారు. దీని వల్ల విద్యుత్ , ఇంధన వనరుల పై చేసే వ్యయాన్నీ తగ్గించడం తో పాటు పర్యావరణ పరిరక్షణ కు విశేషంగా దోహద పడుతుందని ఆయన తెలిపారు .
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీలు గా ఉన్నందువలన 24x 7 విద్యుత్ సరఫరా పై విద్యుత్ సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టేయని , విద్యుత్ వినియోగదారుల అవసరాల మేరకు విద్యుత్ సంస్థలు ఎప్పటికపుడు సేవలు అందిస్తున్నాయని ఇంధన శాఖ కార్యదర్శి బీ శ్రీధర్ ఈ సందర్భంగా తెలిపారు. శుక్రవారం(3-6-22) రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 226 ఎంయూ ఉండగా అందులో థర్మల్ ప్లాంట్ల నుంచి 60 ఎంయూ, సోలార్ నుంచి 24.29, విండ్ నుంచి 23.29, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 50 ఎంయూ, మార్కెట్ కొనుగోళ్ల నుంచి 47 ఎంయూ డిమాండ్ ఉందని తెలిపారు. గత సంవత్సరం ఇదే రోజున డిమాండ్ 172.22 ఎంయూగా ఉంది, ఇది దాదాపు 30 శాతం పెరిగిందన్నారు .