విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా స్థాయిలో సాధించే లక్ష్యాల ఆధారంగా రాష్ట్ర, దేశ స్థాయి సుస్థిరాభివృద్ధి ఆధారపడి ఉంటుందని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో భాగంగా గోల్ నెంబర్ 13 క్లైమేట్ యాక్షన్ పై సోమవారం నగరంలోని స్పందన సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి నష్టం కలగకుండా జరిగే ఆర్థికాభివృద్ధిని సుస్థిరాభివృద్ది అంటారన్నారు. ప్రస్తుత కాలంలో మన అవసరాలను తీర్చుకుంటూ భావితరాలకు కూడా సమకూర్చుకోవడంలో రాజీలేని అభివృద్ధిని సుస్థిరాభివృద్ధి అంటారన్నారు. మానవాళి సంక్షేమానికి ఆర్థికాభివృద్ధి ఒక్కటే సరిపోదని, వనరులను వినియోగించుకుని తిరిగి కల్పించడం వంటి వాటి వల్ల సమతౌల్యత ఏర్పరిచి అభివృద్ధి ప్రక్రియ కొనసాగిస్తే సుస్థిరాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడటం, అడవులను సంరక్షిస్తూ ఏడారీకరణను నిరోధించడం, ప్రకృతి వైపరిత్యాలు జరిగినప్పుడు రైతులకు సహాయం చేయడం, నష్టపరిహారం అందించడం, సంప్రదాయతర ఇంధన వనరులను ప్రోత్సహించడం, మురికినీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేయడం, పరిశ్రమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పారిశ్రామిక మురికినీరు శుద్ధి చేయడం వంటి వాటి వల్ల పర్యావరణానికి హాని కలగకుండా నివారించవచ్చునన్నారు. తరగని వనరుల వినియోగం ముఖ్యంగా సూర్యరశ్మి, గాలి, తరంగాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వంటి వాటి వల్ల వాతావరణంలో సమత్యులత సాధ్యపడుతుందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహిస్తూ, ఆసుపత్రి నుండి వచ్చే బయోలాజికల్ వెస్ట్‌ను శుద్ధి చేయడం, కర్మాగారాల నుండి వచ్చే కాలుష్యన్ని తగ్గించడం తద్వారా ప్రజలకు పరిశుభ్రమైన గాలి, వాతావరణం అందించడం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించవచ్చునని కలెక్టర్ అన్నారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …