-మొక్కలను పెంచవలసిన బాధ్యత యువతదే: సినీ నటి ఇషా చావ్లా
-రాజమండ్రి నగరాభివృద్ధికి ఎంపీ, కలెక్టర్, కమిషనర్ చేస్తున్న కృషి అభినందనీయం:
-మంత్రి తానేటి వనిత
-రాజమండ్రి నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతా
-ఎంపీ భరత్
-ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన ‘యువత-హరిత’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, యువత, విద్యార్థులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, అదే విధంగా పర్యావరణ పరిరక్షణ బాధ్యత కూడా యువతదేనని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. సోమవారం నగరంలోని నందెం గనిరాజు జంక్షన్ వద్ద రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువత – హరిత’ (గో గ్రీన్ చాలెంజ్) కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి ఇషా చావ్లా, రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత, రుడా ఛైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. నందెం గనిరాజు జంక్షన్ రోడ్డు డివైడర్లో మొక్క నాటి మంత్రి వనిత, ఎంపీ భరత్, నటి ఇషా చావ్లా, రుడా ఛైర్పర్సన్ షర్మిలారెడ్డి, కమిషనర్ దినేష్ కుమార్, నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి నీరు పోశారు. అలాగే పలుచోట్ల మొక్కలు నాటి విద్యార్థినీ విద్యార్థులు, యువతతో పాటు వీరు కూడా నీరు పోసి అభినందించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి వనిత మాట్లాడుతూ ‘హరిత – యువత’ కార్యక్రమం పేరుతో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ చేస్తున్న కృషి ప్రశంసనీయం అన్నారు. రాజమండ్రి ముఖ చిత్రాన్ని మార్చేందుకు జిల్లా కలెక్టర్, కమిషనర్, ఎంపీ భరత్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, వీరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అనేక విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని చంటి పాపలా చూసుకుంటే మొగ్గ తొడిగి పుష్పం వికసిస్తే వచ్చే సంతోషమే వేరని పేర్కొన్నారు.
వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తా: సినీ నటి ఇషా చావ్లా
హరిత – యువత కార్యక్రమం చాలా స్ఫూర్తి వంతమైనదని సినీ నటి ఇషా చావ్లా అన్నారు. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, నేనూ ఇక్కడ ఒక మొక్క నాటానని..అది వచ్చే సంవత్సరానికి ఎంత ఎత్తుకు ఎదిగిందో చూసుకునేందుకు వచ్చే సంవత్సరం మళ్ళా రాజమండ్రి వస్తానని అన్నారు. మీరు నాటిన మొక్కకు ఎంత ప్రేమగా నీరు పోసి పెంచుతారో..అదే విధంగా నాపైన చూపించే అభిమానాన్ని నేను నాటిన మొక్కపై చూపించి చాలా జాగ్రత్తగా ‘నా మొక్కను’ కూడా పెంచాలని విద్యార్థినీ విద్యార్థులకు, యువతను నటి ఇషా చావ్లా కోరారు. మొక్కలు నాటే కార్యక్రమాలకు అనేక చోట్లకు వెళ్ళాను కానీ, ఇక్కడ విద్యార్థులు వారు నాటిన మొక్కలను దత్తత తీసుకోవడం, నిత్యం బాటిల్స్ తో నీరుతెచ్చి పోయటం అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందన్నారు. ఇదే విధానాన్ని అన్ని చోట్లా కొనసాగిస్తే మంచి ఫలితం వస్తుందన్నారు.
కంటికి రెప్పలా కాపాడండి: ఎంపీ భరత్
‘యువత- హరితా’ కార్యక్రమం ద్వారా రాజమండ్రి నగరంలో ఇప్పటికే పలు చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించామని ఎంపీ మార్గాని భరత్ రామ్ చెప్పారు. మొక్క నాటడమే కాకుండా ఒక చంటి బిడ్డ మాదిరిగా సంరక్షిస్తే అది మహా వృక్షమై మానవాళి మనుగడకు దోహదపడుతుందని చెప్పారు. రాజమండ్రి నగరంలోనే పుట్టాను, పెరిగాను..నా జన్మభూమి రుణం తీర్చుకునేందుకు సీఎం జగనన్న నాకు మంచి అవకాశం ఇచ్చారన్నారు. రాత్రింబవళ్ళు 365 రోజులూ ప్రజల మధ్యనే ఉండి వారి మంచీ చెడ్డలు చేసుకోవడంలో ఎంతో తృప్తి పొందుతున్నానని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులు రేపటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణకు మీ వంతు కృషి చేయవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఉందన్నారు. వివాహమైతే మీ పిల్లలపై ఎంత మమకారం చూపిస్తారో అంతటి ప్రేమానురాగాలను మీరు నాటిన మొక్కలపై చూపించాలని విద్యార్థినీ విద్యార్థులు, యువతను ఉద్దేశించి ఎంపీ భరత్ కోరారు. వచ్చే సంవత్సరానికి రాజమండ్రి రూపు రేఖలు సమూలంగా మారిపోతాయని, అద్భుతమైన సుందర హరిత నగరంగా రాజమండ్రి మారబోతోందని చెప్పారు.
ఈ సభా కార్యక్రమంలో రుడా ఛైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, నగర కమిషనర్ కే దినేష్ కుమార్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, పాలిక శ్రీను, ఎన్వీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.