-రీ సర్వే రెండవ విడత గ్రామాలలో గ్రౌండ్ ట్రూతింగ్ మార్చి 31 లోపు పూర్తి చేయాలి:కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రీ సర్వే ప్రక్రియకు సంబందించి గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసేలా చూడాలని సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జి.సాయిప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్ లను ఆదేశించారు. గురువారం విజయవాడ సి.సి.ఎల్.ఏ. కార్యాలయం నుండి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రీ సర్వే కార్యాచరణ, అమలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కన్ఫెరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, జె.సి. డి.కె.బాలాజీ, డి.ఆర్.ఓ. శ్రీనివాస రావు, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రీ సర్వే కు సంబంధించి గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. రీ సర్వే కు సంబంధించి మ్యూటేషన్ కరెక్షన్, ట్రాన్సా క్షన్ తదితర అంశాలపై సమీక్షించారు. వీడియో కన్ఫెరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సంబందిత అధికారులతో మాట్లాడుతూ రీ సర్వే రెండవ దశ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 202 గ్రామాలకు గాను 133 గ్రామాలలో గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియ పూర్తి కాగా మిగిలిన గ్రామాల్లో మార్చ్ 31 నాటికి పూర్తి చేయాలని అన్నారు. 22 గ్రామాలకు గాను 18 గ్రామాలలో ఫైనల్ ఆర్.ఓ.ఆర్, డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ 28 గ్రామాలలో పనులు పూర్తి అయిన నేపథ్యంలో మిగిలిన గ్రామాల్లో త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు. హద్దు రాళ్ళు నాటే ప్రక్రియకు సంబందించి 69 గ్రామాలకు గాను 13 గ్రామాలలో పూర్తి అయ్యిందని అధికారులు వివరించగా మిగిలినవి కూడా తొందరలో పూర్తి చేయాలని ఆదేశించారు.