Breaking News

నగరంలో పారిశుధ్య పనులు, ఇంటింటి చెత్త సేకరణ, ట్రేడ్ లైసెన్స్ లపై సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో నూతన డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్సులు, రెన్యువల్స్ కు తప్పనిసరిగా సదరు సంస్థలు ఆస్తి, ఖాళీ స్థల, నీటి పన్నులు పూర్తిగా చెల్లించిన రశీదులు ఉంటేనే చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ శానిటేషన్ కార్యదర్శులు, ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజారోగ్య విభాగ అధికారులతో, జూమ్ ద్వారా శానిటేషన్ కార్యదర్శులతో నగరంలో పారిశుధ్య పనులు, ఇంటింటి చెత్త సేకరణ, ట్రేడ్ లైసెన్స్ లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రతి కమర్షియల్ సంస్థ తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రేడ్ లైసెన్స్ నూతనంగా మంజూరు చేసేప్పుడు సదరు సంస్థ నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులు చెల్లించి ఉంటేనే దరఖాస్తు ప్రాసెస్ చేయాలని శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. పన్ను వివరాల కోసం సంబందిత వార్డ్ అడ్మిన్ కార్యదర్శితో సమన్వయం చేసుకోవాలన్నారు. సచివాలయం పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ మ్యాపింగ్ రెండు రోజుల్లో పూర్తీ చేయాలన్నారు. ప్రతి షాప్ డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకోవాలని, వ్యర్ధాలను రోడ్ల పై, కాల్వల్లో వేసే షాప్స్ సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రధాన రోడ్లను శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా కార్మికులను కేటాయించాలని, రోడ్ల వెంబడి కాల్వలు కూడా ఫ్రీ ఫ్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీధి వ్యాపారుల నుండి చెత్త సేకరణకు ప్రత్యెక సమయం కేటాయించాలని, రోడ్ల మీద వ్యర్ధాలు వేసే వారి కి అపరాధ రుసుం విధించాలన్నారు. కమర్షియల్ సంస్థల నుండి వ్యర్ధాలు సేకరించే కాంట్రాక్టర్లు ప్రతి రోజు సేకరణ చేస్తుంది, లేనిది పరిశీలించాలన్నారు. నిర్మాణాలు జరుగుతున్న భవనాలకు ప్లానింగ్ కార్యదర్శులను సమన్వయం చేసుకుంటూ గ్రీన్ మ్యాట్ లు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. సచివాలయం పరిధిలో కార్మికులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎఫ్.ఆర్.ఎస్. ద్వారానే హాజరు తీసుకోవాలని, ప్రతి కార్యదర్శి ప్రజలకు హోం కంపోస్ట్ తయారి ప్రాధాన్యత, తయారి విధానంపై అవగాహన కల్గించాలని, అలాగే అపార్ట్మెంట్ ల్లో క్లస్టర్ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణ చేసే సమయంలోనే ఆర్.ఎఫ్.ఐ.డి.ట్యాగ్ లను స్కాన్ చేయాలని, స్కానర్లు మరమత్తు ఉంటే వెంటనే చేయించాలన్నారు. ఎస్.ఐ.డివిజన్ల వారిగా రూట్ మ్యాప్ ప్రకారం చెత్త తరలింపుకు వాహనాలు వచ్చేలా వెహికిల్ షెడ్ అధికారులు చూడాలని, ఎక్కడైనా సమస్య ఏర్పడితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2023 స్వచ్చ సర్వేక్షణ్ లో గుంటూరు నగరం మెరుగైన ర్యాంక్ సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
సమావేశంలో సిఎంఓహెచ్ డాక్టర్ విజయలక్ష్మి, ఎం.హెచ్.ఓ. డాక్టర్ భాను ప్రకాష్, ఈ.ఈ. కొండారెడ్డి, ఏ.ఈ. దుర్గా ప్రసాద్, యస్.యస్.లు రాంబాబు, ఆయుబ్ ఖాన్, సోమశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *