-పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్న 28412 అభ్యర్థులు,152 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
-ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ అభ్యర్థులు 3879: డి ఆర్ ఓ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రిల్ 3 నుండి 18 వరకు ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయని, జిల్లాలో 152 పరీక్షా కేంద్రాల్లో 28412 అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని ఏర్పాట్లు పగద్భందీగా చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు అన్నారు.
శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి వారి చాంబర్లో జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై డిఆర్ఓ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ తిరుపతి కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత జరగనున్న మొట్ట మొదటి సారిగా పదవ తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షలు నిర్వహణ జరుగుతోందని వీటిని పగడ్బందీగా ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని అన్నారు. పదవ తరగతి పరీక్ష పత్రాలు ఎస్వీయూ క్యాంపస్ పాఠశాల, బాలాజీ నగర్ కాలనీ తిరుపతి లో స్ట్రాంగ్ రూమ్ లో ఈ నెల 19 నాటి నుండి భద్రపరచడం జరుగుతుందని, ఇదే క్యాంపస్ లో స్పాట్ వ్యాలుయేషన్ ఉంటుందని తగినంత బందోబస్తు ఉండాలని సూచించారు. పరీక్షల నిర్వహణ సమయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు, ఉప తహసీల్దారులతో 6 ఫ్లయింగ్ స్క్వాడ్ల ఏర్పాటు ఉంటుందని, ఏపీఎస్ఆర్టీసీ పదవ తరగతి హాల్ టికెట్ కలిగిన విద్యార్థులను ఉచితంగా పరీక్ష కేంద్రాలకు వెళ్లే విధంగా నిబంధనల మేరకు అనుమతించాలని అన్నారు. వైద్య శాఖ పరీక్ష కేంద్రాల వద్ద ప్రాథమిక చికిత్స కేంద్రాల ఏర్పాటు ఓ ఆర్ ఎస్ స్యాచెట్ లు తదితర మందులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. త్రాగునీటి వసతి శానిటేషన్ ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సోసైటీ పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా జరగనున్నాయని, ఎస్.ఎస్.సి 7 సెంటర్లలో ఇంటర్మీడియట్ 11 సెంటర్లలో నిర్వహించడం జరుగుతుందని, పదవ తరగతి 1382 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ 2497 మంది విద్యార్థులు హాజరుకానున్నారని అన్నారు. పదవ తరగతికి సంబంధించి రెగ్యులర్ విద్యార్థులకు ఉదయం 9:30 గం. నుండి ప్రారంభం అయ్యి మధ్యాహ్నం 12.45 గం ల వరకు పరీక్షల నిర్వహణ, అలాగే ఓపెన్ స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గం. నుండి సాయంత్రం 5.30 గం. వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖాధికారి వి. శేఖర్, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఆనంద రెడ్డి, తిరుపతి అదనపు మునిసిపల్ కమిషనర్ సునీత, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యం, ఖజానా శాఖ అధికారి ప్రసాద్, ఏపీ ఎస్పిడిసియెల్ డి.ఈ శ్రీనివాసులు, పోలీస్ శాఖ నుండి ప్రజా రవాణా శాఖ అధికారులు నాయుడు, జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయం నుండి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.