-ఈ నెల 21న కలెక్టరేట్ లోని ఉద్యోగస్తులకు మరియు తుడా సిబ్బందికి వైద్య పరీక్షలు: కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యవంతమైన భవిత, ప్రజలు రాష్ట్రానికి, దేశానికి వెన్నెముక అని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ మరియు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని ప్రభుత్వ లక్ష్యాన్ని వైద్య ఆరోగ్య శాఖ వారు అంది పుచ్చుకోవాలి అని, అదే దిశలో చంద్రగిరి నియోజకర్గంలో గౌ. శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి వారి ఆధ్వర్యంలో తుడా సహకారంతో పెద్ద ఎత్తున ప్రజలకు అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించి రోగ నిర్దారణ చేసి రోగం తీవ్రం కాకుండానే ముందుగానే గుర్తించి చికిత్స అందించే దిశలో చర్యలు చేపట్టడం అభినందనీయం అని, ఇది దేశంలోనే మొట్టమొదటి సారిగా అమలు చేయబడుతోందని మిగిలిన రాష్ట్రాలకు ఇది దిక్సూచి అవుతుందని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు.
మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వైద్య అధికారులు, ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో పేద ప్రజలకు అసంక్రమిత వ్యాధుల పరీక్షలు ఈ నెల 24 నుండి సచివాలయ పరిధిలో రోజుకు 4000 మందికి ఒక్కో సచివాలయం కు 2000 మంది చొప్పున రెండు రోజులు, రెండు ప్రదేశాల్లో వైద్య పరీక్షలు చేపట్టి 90 రోజుల్లో నియోజక వర్గంలోని ప్రజందరూ కవర్ అయ్యేలా ప్రణాలిక ఏర్పాటుతో, రోగ నిర్ధారణ అయిన తర్వాత చికిత్సకు ఆరోగ్యశ్రీ సంబంధిత ఆసుపత్రికి లేదా ప్రైవేట్ ఆస్పత్రి కి రెఫర్ చేయడం జరుగుతుందని అన్నారు. చికిత్స అనంతరం ఫాలోఅప్ మందులు గైడెన్స్ తరచూ గృహ సందర్శన ద్వారా చేపట్టడం జరుగుతుందని అన్నారు. దీనివలన ముందుగానే రోగనిర్ధారణ జరిగి చికిత్స చేసి ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుందని, ఆరోగ్యశ్రీ పై ఒత్తిడి తగ్గుతుందని ఈ బృహత్తర కార్యక్రమానికి అందరూ సహకరించి సమన్వయంతో పేదల ఆరోగ్యం కొరకు చేపట్టిన యజ్ఞాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ పరీక్షలు 106 సచివాలయాల పరిధిలో సుమారు 5 లక్షల మంది జనాభా కలిగిన చంద్రగిరి నియోజకవర్గంలో రోజువారిగా 104 వాహనాల ద్వారా పరీక్షలు జరిగే ప్రాంతాలు, వాటి తేదీలు, వాటికి కేటాయించబడిన వైద్యాధికారులు సిబ్బంది, వాటి వివరాలను మ్యాపింగ్ చేసి ముందుగానే ఆ గ్రామంలో దండోరా వేసి ప్రజలకు అవగాహన కల్పించి ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య ఆసుపత్రులు యాజమాన్యాలు ఇందులో భాగస్వాములై వారి సిబ్బంది ని వివరాలను మ్యాపింగ్ చేసి సహకరించాలని తెలిపారు. వైద్య పరీక్షల నిర్వహణకు బ్లడ్ శాంపిల్స్ కొరకు ఒక్కో చోట 30 కౌంటర్లు ఏర్పాటు చేసి వైద్య పరీక్షకు వచ్చే ప్రజలకు టైం స్లాట్ కేటాయించడం జరుగుతుందని సదరు మెడికల్ రిపోర్టులు యాప్ లో ఆన్లైన్లో అప్లోడ్ చేసి భవిష్యత్తు కొరకు అందుబాటులో ఉంచటం జరుగుతుందని తెలిపారు. ఈ విధమైన స్క్రీనింగ్ పరీక్షల ద్వారా ఆయా సచివాలయ పరిధిలోని ప్రజలకు గల ఆరోగ్య సమస్యల రికార్డు ఏర్పాటుతో అవసరమైన మేరకు మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టే ఒక పక్కా డేటాబేస్ ఉంటుందని తెలిపారు. దీని ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగా గుర్తించే అవకాశం ఉంటుందని వారికి మంచి చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. గతంలోనే ఈ 104 వాహనాల ద్వారా 65 రకాల పరీక్షలు చేసి, 105 రకాల మందులు అందుబాటులో ఉంచి సేవలు అందిస్తున్నామని, ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ECG తదితర పరీక్షలు నిర్వహించేలా స్క్రీనింగ్ పరీక్షలు చంద్రగిరి నియోజక వర్గంలో చేపడుతున్నామని అన్నారు. ఇందులో భాగంగా ముందుగా ఈనెల 21న కలెక్టరేట్లో ఉద్యోగస్తులకు తుడా సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వివరాలను సరిచూడడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో తుడా విసి హరికృష్ణ, ఎస్డిసి భాస్కర్ నాయుడు, DMHO శ్రీహరి,డి సి హెచ్ ఎస్ ప్రభావతి, రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయ అధికారి, మరియు ప్రభుత్వ హాస్పిటల్స్ SVRR GGH సూపరింటెండెంట్ , స్విమ్స్ సూపరింటెండెంట్, బర్డ్స్ స్పెషల్ ఆఫీసర్ రెడ్డప్ప మరియు పద్మావతి హార్ట్ అండ్ చిల్డ్రన్ స్పెషాలిటీ డైరెక్టర్ శ్రీనాథ్, ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం పాల్గొన్నారు.