-గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి గ్రామ అభివృద్దే సూచిక: కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని వివిధ గ్రామ పంచాయితీలలో గ్రామాల అభివృద్ధికి విశేష సేవలు అందించిన సర్పంచులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం 2023 సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలోని పంచాయితీల అభివృద్ధికి తమ వంతు కృషి చేసి అభివృద్ధికి సేవలు అందించినందుకు వారికి అభినందనలు తెలుపుతూ, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలంటే గ్రామాలు అభివృద్ధి చెందితేనే సాధ్యమని అన్నారు. అదేవిధంగా ప్రతి సర్పంచ్ తమ గ్రామ పంచాయితీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని, గ్రామ పంచాయితీలలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే దిశగా సేవలు అందించేలా ఉండాలని కోరారు. గ్రామస్థాయిలో సచివాలయాల ఏర్పాటుతో తగినంత మంది సిబ్బంది అందుబాటుతో గ్రామంలో సుపరిపాలన అందించే దిశగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలు సమర్థవంతంగా అమలు చేసే దిశలో ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు అభివృద్ధి సాధనలో మమేకం కావాలని పిలుపునిచ్చారు.
జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవం 2023 సందర్భంగా జిల్లాలోని గ్రామ పంచాయితీల అభివృద్ధిలో సేవలందించిన నలుగురు సర్పంచులను సన్మానించారు.
పేదరికం లేని మెరుగైన జీవనోపాధులు కలిగిన గ్రామ పంచాయితీ గా వెంకటగిరి మండలంలో జంగాల పల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి ప్రమీలను, పరిశుభ్రమైన హరిత గ్రామ పంచాయితీగా తడ మండలం, తడ గ్రామ పంచాయితీ సర్పంచ్ ఆర్ముగం ను, స్వయం సమృద్ధిలో మౌలిక సదుపాయాలు కలిగిన గ్రామ పంచాయితీగా నాయుడుపేట మండలం కూడేరు గ్రామ పంచాయితీ సర్పంచ్ పులి శాంతమ్మను, సుపరిపాలన కలిగిన గ్రామ పంచాయితీగా వాకాడు మండలం నిడుకుర్తి గ్రామ పంచాయితీ సర్పంచ్ మల్లారపు నాగరాజు లను జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కరించి ప్రశంస పత్రాలను అందజేశారు.
అలాగే రాష్ట్ర స్థాయిలో కాదలూరు గ్రామపంచాయతీ సర్పంచ్ కిలివేటి మస్తానమ్మ తడ గ్రామం తడ మండలం వారు పచ్చదనం పరిశుభ్రత లో ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారి రాజశేఖర్ రెడ్డి, డి.ఎల్.పి.ఓ రూపా రాణి, గూడూరు డిఎల్పీఓ వెంకట రమణ, సర్పంచులు పాల్గొన్నారు.