తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా దోమల వలన ఏర్పడే మలేరియాలాంటి వ్యాధులను నివారించవచ్చని డి.ఆర్.ఓ. శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఉదయం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా స్థానిక డి.ఎం.హెచ్.ఓ కార్యాలయం నుండి రుయా ఆసుపత్రి వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని డి.ఆర్.ఓ గారు డి.ఎం.హెచ్.ఓ శ్రీహరి తో కలిసి పాల్గొని జండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డి.ఆర్.ఓ. మాట్లాడుతూ ప్రపంచ మలేరియా దినోత్సవం లో భాగంగా ప్రజలకు మలేరియా పై అవగాహన కల్పించి మలేరియా బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతోందని అన్నారు. పరిశుభ్రతను పాటించడం ద్వారా దోమల వృద్ధి చెందకుండా చూడవచ్చని అన్నారు. ఇంటి నుండే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి వాటిని సరైన రీతిలో స్థానిక సంస్థల సహకారంతో డిస్పోజ్ చేసేలా ఉండాలని , మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని తద్వారా రోగాల బారిన పడకుండా ఉండవచ్చని ప్రజలకు సూచించారు.
డి.ఎం.హెచ్.ఓ, మాట్లాడుతూ 1895 వ సంవత్సరంలో సర్ రోనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త ఈ మాలేరియా వ్యాధి ప్లాస్ మోడ్ అనే క్రిమి వల్ల కలుగుతుందని గుర్తించారని అప్పటి నుండి ఈ రోజును ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. గౌ. ముఖ్యమంత్రి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఫ్రై డే – డ్రై డే వంటి కార్యక్రమం అమలు చేయడం ద్వారా ఏ ఇంటిలోనూ, పరిసర ప్రాంతాలాలో కూడా మురుగు నీరు నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోందని తద్వారా మలేరియా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. అదే విధంగా వెక్టార్ కంట్రోల్ యాప్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చి అందులో ప్రజలు నమోదు చేసిన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుని మలేరియా ను పూర్తిగా నివారించే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగ మునీంద్రుడు, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ పార్థ సారథి, నగర పాలకసంస్థ ప్రజారోగ్య అధికారి హరికృష్ణ, జిల్లా ఇమ్యునైజేశన్ అధికారి శాంత కుమారి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ, సుధారాణి, వైద్య అధికారులు, ఆశా వర్కర్లు, ఎ.ఎన్.ఎం. లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.