-జాతర సందర్భంగా మొక్కులు తీర్చుకున్న డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి
-అంగరంగ వైభవంగా తిరుపతి గంగ జాతర
-ప్రజలను ఆకట్టుకున్న కళారూపాలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంగరంగ వైభవంగా మేళతాలు,మంగళ వ్యాద్యాల నడుమ కుటుంబ సభ్యులతో కలసి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సమర్పించారు. బుధవారం ఉదయం శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి సారె సమర్పించారు. స్థానిక పద్మావతి పురం ఎమ్మెల్యే నివాసం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులు పసుపు, కుంకుమ, పూలు, పళ్లు, రవిక, పట్టు చీరలను పల్లెలం ఉంచి తల పై పెట్టుకొని ఊరేగింపుగా తీసుకొచ్చి గంగమ్మ తల్లికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ దేవత అయిన గంగమ్మ తల్లికి సారె సమర్పణ కార్యక్రమం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పద్మావతి పురం ఎమ్మెల్యే నివాసం నుంచి అమ్మవారి ఆలయం వరకు జనసందోహంగా మారింది. వీధులన్నీ వేపాకు తోరణాలతో పాటు మామిడి, అరటి తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దారి పొడవునా మహిళా భక్తులు పసుపు నీళ్లు కుమ్మరిస్తూ, టెంకాయలు కొట్టుతూ కర్పూర హారతులిస్తూ స్వాగతించారు.
భక్తులు పెద్ద ఎత్తున గంధం బొట్లు పెట్టుకుని, వేపాకు చేతబూని, వివిధ వేషధారణలతో విచ్చేసి భక్తి శ్రద్దలు ప్రపత్తులు చాటుకున్నారు. రాష్టంలోనే వివిధ జిల్లాల కు చెందిన వివిధ రకాల కళాకారులు దారి పొడవునా జానపద శైలిలో సాగే అమ్మ వారి భక్తి కీర్తనలతో, డప్పు వాయిద్యాల నడుమ భక్తులు లయబధ్ధంగా చిందేస్తూ పులకించి పోయారు. గంగమ్మ నామ స్మరణతో తిరునగరి హోరెత్తింది. నవదుర్గలు, కాంతారా, తప్పెటగుళ్లు, డప్పులు,తీన్ మార్, కీలు గుర్రాలు, కొమ్ము కొయ్య, దింసా, పగటి వేషగాళ్లు, పులివేషాలు, గరగల్లు, బోనాల కళాప్రదర్శలు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి. వేసవి తీవ్రతను లెక్కచేయకుండా భక్తులు శోభా యాత్ర గా గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు.
ఎమ్మెల్యే నివాసం పద్మావతి పురం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శిరీష నగర పాలక సంస్థ కమీషనర్ హరిత,ఆలయ పాలక మండలి సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.