-వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకు లను తీర్చి దిద్దుతాం..
-రాష్ట్రంలోని సహకార రంగానికి ప్రత్యేకమైన బ్రాండ్ తీసుకుని వచ్చేలా కృషి చెయ్యడం జరుగుతుంది
-వ్యవసాయ శాఖ మంత్రి కె. గోవర్ధన రెడ్డి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వాణిజ్య బ్యాంకులకు దీటుగా రాష్ట్రంలో సహకార రంగాన్ని, సహకార బ్యాంకింగ్ రంగాన్ని తీర్చి దిద్దుతామని రాష్ట్ర వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ & ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక శ్యామల థియేటర్ ఎదురుగా గల సహకార బ్యాంకు బ్రాంచ్ నందు రు. 2.50 కోట్ల రూపాయలతో నూతనంగా సహకార బ్యాంకు అధునాతన భవనానికి మంత్రి గోవర్ధన రెడ్డి, హోంమంత్రి తానేటి వనిత, డిసిసిబి చైర్మన్ ఆకులు వీర్రాజు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ మార్గాని భరత్ రామ్, రూడా చైర్ పర్సన్ షర్మిల రెడ్డి, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా లతో కలిసి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, నేడు రు. 2.50 కోట్ల రూపాయలతో నూతనముగా సహకార బ్యాంకు బ్రాంచ్ భవనానికి శ్రీకారం చుట్టిన చైర్మన్, పాలకమండలి సభ్యులను అభినందించారు. దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో సహకార రంగానికి మరింత విశిష్టత తీసుకుని వొచ్చే దిశలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేయడం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో సహకార బ్యాంకులు, సొసైటీలు నిర్వీర్యంకు గురికాకూడదన్నారు. రైతాంగానికి మరింత సేవలందించే దిశగా వ్యాపార అభివృద్ధికి గాను రాష్ట్ర ముఖ్యమంత్రి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. వీటి మనుగడ పురోగతి దిశలో అభివృద్ధికి గాను రు.295 కోట్ల రూపాయలతొ 13 ఉమ్మడి జిల్లా ల్లో సహకార బ్యాంకులు, సొసైటీలను మరింత పటిష్టం చేయడం జరిగిందని మంత్రి అన్నారు. ఆ నిర్ణయం వల్ల నేడు అవి లాభాల బాటలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సహకార బ్యాంకును మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా “ఆంధ్రాబ్యాంక్” బ్రాండ్ ను పెట్టే ప్రయత్నం చేస్తూ, రిజర్వు బ్యాంకు వారి సౌజన్యంతో మరింత ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వాణిజ్య బ్యాంకులకు దీటుగా రాష్ట్రంలో సహకార రంగం బ్యాకింగ్ వ్యవస్థ అభివృద్ధి కోసం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. సహకార రంగం అభివృద్ధి చేయడం ద్వారా రైతాంగానికి కూడా ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
శంకుస్థాపన కార్యక్రమంలో హోం మంత్రి తానేటి వనిత, జిల్లా సహకార, బ్యాంక్ అధ్యక్షులు ఆకుల వీర్రాజు, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీ రాణి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ మార్గని భరత్ రామ్, రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఆర్డిఓ ఏ చైత్ర వర్షిని, సహకార బ్యాంకు సీఈవో నరసింహం , వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.