-మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం పై కఠిన చర్యలు…
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాదక ద్రవ్యాల రవాణా వినియోగం పై ప్రత్యేక నిఘా పెట్టి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహారరెడ్డికి వివరించారు. నషా ముక్తి భారత్ అభియాన్‌లో భాగంగా మాదక ద్రవ్యాల నివారణకు చేపట్టిన చర్యల పై మంగళవారం రాష్ట్ర స్థాయి నార్కో కోఆర్డినేషన్ ( ఎన్‌సిఓఆర్‌డి ) కమీటి సమావేశాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహారరెడ్డి ఆయన కార్యాలయం నుండి అన్ని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలోని వీడియోకాన్ప్‌రెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పాల్గొన్నారు.
కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల నివారణ, అమ్మకం వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ఐదు నెలలుగా గంజాయి మత్తుపదార్థాల వినియోగంపై దృష్టి పెట్టామన్నారు. విజయవాడ పరిధిలోని గంజాయి వినియోగానికి హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాలలో మాదక ద్రవ్యాల వినియోగించే ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేశామన్నారు. గంజాయి అమ్మకం నిర్వహించే వారిపై కఠిన చర్యలు నమోదు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించామన్నారు. జిల్లాలోకి ఎటువంటి డ్రగ్స్ ప్రవేశించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కళాశాలల స్థాయిలో విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వలన కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గంజూయి సరఫరా దారులను అదుపులోకి తీసుకుని వారిపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి వినియోగంచే వారిని అదుపులోకి తీసుకుని వారి ద్వారా వివరాలను సేకరించి జిల్లాకు గంజాయి సరఫరా చేసేవారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. పేదల నివాస ప్రాంతాలు, మురికి వాడలు, పాఠశాలలు, కళాశాలలో మత్తుపదార్థాల వినియోగిస్తే కలిగే దుష్పలితాలు, చట్టాలు, కేసులపై అవగాహన కల్పిస్తునట్లు కలెక్టర్ డిల్లీరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.