Breaking News

సమాజానికి పోలీసులు అండగా నిలుస్తున్నారు…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్రెండ్లీ పోలీసింగ్, సేవా దృక్పధంతో సమాజానికి పోలీసులు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర హోమ్ మంత్రి  తానేటి వనిత చెప్పారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు  మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన ఎం.పి. ల్యాడ్స్ నిధుల నుంచి మంజూరు చేసిన రూ.2 కోట్లతో ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో అధునాతన సదుపాయాలతో నిర్మించిన పోలీసు కల్చరల్ యాక్టివిటీస్ బిల్డింగ్ మరియు గెస్ట్ హౌస్ ను ప్రజా ప్రతినిధులు మరియు ఉన్నతాధికారుల సమక్షంలో శుక్రవారం హోమ్ మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గుంటూరు రేంజ్ ఐ.జి.  జి.పాలరాజు, కలెక్టర్  ఏ.ఎస్. దినేష్ కుమార్, ఎస్.పి.  మలికా గర్గ్, జడ్పీ ఛైర్పర్సన్  బూచేపల్లి వెంకాయమ్మ, ఎం.పి.  మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎం.ఎల్.సి. కె.శ్రీకాంత్, ఒంగోలు నగర మేయర్  గంగాడ సుజాత, ట్రైనీ ఐ.పి.ఎస్. అంకితా సురానా. తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హోమ్ మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సేవలందించడానికి పోలీసు శాఖ నిత్యం అందుబాటులో ఉంటుందన్నారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానము, జీరో ఎఫ్.ఐ.ఆర్. పద్ధతిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని ఆమె చెప్పారు. నేడు పోలీసులు ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా సత్వరమే స్పందించి, విచారణ చేపట్టి తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటున్నారని ఆమె తెలిపారు. మహిళల భద్రతే ధ్యేయంగా అన్ని జిల్లాలలో దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, దాదాపు కోటి అరవై లక్షల దిశ యాప్ రిజిస్ట్రేషన్లు చేయించి మహిళలకు అత్యవసర సమయంలో తక్షణ సేవలు అందిస్తున్నారని ఆమె వివరించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో, సేవా దృక్పధంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఒంగోలును సందర్శించే పోలీసు అధికారులకు మరియు ఇతర ప్రముఖులకు సౌకర్యవంతమైన వసతిని అందించేలా బహుళ ప్రయోజనకరంగా నిర్మించిన ఈ గెస్ట్ హౌస్ కు నిధులు సమకూర్చిన ఒంగోలు ఎం.పి.కి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఎం.పి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఎస్.పి. మలికా గర్గ్ ప్రత్యేక పర్యవేక్షణలో ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం పూర్తి కావడం సంతోషకరమన్నారు. తన స్వంత ఇంటి నిర్మాణం మాదిరిగా ఆమె ప్రతి దశలోనూ ఈ గెస్ట్ హౌస్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఆయన అభినందించారు. జిల్లా పోలీసు శాఖ అభివృద్ధికి ఏవిధమైన సహాయం అందించడానికైనా ఎల్లవేళలా తాను ముందు ఉంటానని ఎం.పి. ప్రకటించారు.

ఎస్.పి. మాట్లాడుతూ ఈ భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన హోమ్ మంత్రి, పురపాలక శాఖ మంత్రులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంలో కృషి చేసిన ఎస్.పి., వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లను హోమ్ మంత్రి శాలువా కప్పి అభినందించారు.

పోలీసులు సత్వరమే స్పందించారు : హోమ్ మంత్రి
ఒంగోలులో గిరిజన యువకుడిపై దాడి, మూత్రం పోసిన ఘటనకు సంబంధించిన వీడియో. సోషల్ మీడియా ద్వారా తెలియగానే పోలీసులు సత్వరమే స్పందించారని హోమ్ మంత్రి తానేటి పనిత చెప్పారు. ఈ దాడి చేసిన 9 మంది నిందితులలో ఆరుగురిని వెంటనే అరెస్ట్ చేశారని, ఆచూకీ తెలియని మిగతా ముగ్గురి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను నియమించామని ఆమె తెలిపారు. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. బాధిత గిరిజన యువకుడికి పోలీసులు, ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ సంఘటనతో సంబంధం లేకుండా బాధితుడు, దాడి చేసిన నిందితులు కలిసి గతంలో చేసిన నేరాలకు సంబంధించి వారందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.పి.లు, డి.ఎస్.పి.లు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *