– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-64 వ డివిజన్ 282 వ సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి పేద కుటుంబానికి మేలు చేకూరిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 64 వ డివిజన్ 282 వ వార్డు సచివాలయ పరిధిలో శనివారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. కండ్రికలో విస్తృతంగా పర్యటించి.. 312 గడపలను సందర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సిఫార్సులతో ప్రమేయం లేకుండా, ఎక్కడా అవినీతికి తావులేకుండా తమకు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందుతున్నాయని మహిళలు, వృద్ధులు ఎమ్మెల్యేకు వివరించారు. గతంలో ఏ ప్రభుత్వం పేదల కోసం ఇన్ని పథకాలను అమలు చేయలేదని.. సీఎం జగన్ తోనే అది సాధ్యమైందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి, అందిస్తున్న పథకాల గురించి ప్రజలు ఎంతో గొప్పగా చెబుతుంటే సంతోషంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావడంలో ఎటువంటి జాప్యం జరిగిన తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కాపుల అభ్యున్నతికి విశేష కృషి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకమైనా.. సెంట్రల్లో వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందని మల్లాది విష్ణు అన్నారు. నాలుగో విడత కాపు నేస్తం ద్వారా నియోజకవర్గంలో 2,583 మంది కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల అక్కచెల్లెమ్మలకు రూ. 3 కోట్ల 87 లక్షల 45 వేల లబ్ధి చేకూరినట్లు మల్లాది విష్ణు తెలిపారు. మొదటి విడతలో 1,107 మందికి రూ. కోటి 66 లక్షల 5 వేలు., రెండో విడతలో 1,869 మందికి రూ. 2 కోట్ల 80 లక్షల 35 వేలు., మూడో విడత ద్వారా 2,042 మందికి రూ. 3 కోట్ల 6 లక్షల 30 వేలు.. మొత్తంగా నాలుగేళ్లలో రూ. 12 కోట్ల మేర మేలు చేకూరినట్లు వివరించారు. అలాగే రూ. కోటి నిధులతో నిర్మిస్తున్న కాపు కళ్యాణ మండపానికి దివంగత నేత వంగవీటి మోహనరంగా పేరు పెట్టనున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఆయన వర్థంతి (డిసెంబర్ 26) నాటికి కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకునేలా పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలియజేశారు.
వైద్య విద్యలో సరికొత్త అధ్యాయానికి నాంది
అధికారంలో ఉండగా పేదల కోసం ఏవిధంగా పనిచేయాలనడానికి సీఎం జగన్ ప్రభుత్వమే ఓ చక్కని ఉదాహరణ అని మల్లాది విష్ణు అన్నారు. పేదల వైద్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఐదు కొత్త మెడికల్ కళాశాలలను ఒకే రోజు ప్రారంభించడం ద్వారా ప్రజారోగ్య రంగంలో సరికొత్త అధ్యాయానికి సీఎం జగన్ నాంది పలికారన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికో మెడికల్ కాలేజీ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టి.. అందులో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలోని కాలేజీలను ప్రారంభించుకోవడం శుభపరిణామన్నారు. సామాన్య, పేద కుటుంబాల విద్యార్థులు సైతం వైద్య విద్యను అభ్యసించేలా.. ఆలోచన చేసిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. గెలుపు వైసీపీదే
ప్రజాధనాన్ని దోచుకున్న చంద్రబాబు అమాయకుడంటూ నారా లోకేష్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎన్ని కుంభకోణాలు చేసినా.. తమను ఎవరూ ఏమీ అనకూడదన్న విధంగా లోకేష్ వ్యవహార శైలి ఉందని విమర్శించారు. మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో అత్యంత బలమైన నాయకుడిగా సీఎం జగన్ మారిపోయారని చెప్పడానికి.. ప్రతిపక్షాల కలయికే ఒక ఉదాహరణ అని మల్లాది విష్ణు అన్నారు. వెంటిలేటర్ పై టీడీపీని బ్రతికించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తున్నాయన్నారు. కేవలం పవన్ కళ్యాణ్ తప్ప చంద్రబాబు అరెస్టును ఎవరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం వేధింపులకు గురిచేసిన రోజున.. ఎందుకు మాట్లాడలేదని పవన్ ను సూటిగా ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసివచ్చినా తమకు ఎటువంటి నష్టం లేదని.. 175 నియోజకవర్గాలలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులే గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ(యూజీడీ & వాటర్ సప్లై) రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు యరగొర్ల రాములు, ఇస్మాయిల్, జిల్లెల్ల శివ, పందిరి వాసు, విన్నకోట నాగు, మాతా మహేష్, కొక్కిలిగడ్డ నాని,అగురు త్రినాథ్, పరిమి నాగేశ్వరరావు, వెంకటేశ్వరమ్మ, విమల, తాండవ కోటి, కిరణ్, కృప, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.